హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పురోగతి చూపెట్టని ఆయిల్ కంపెనీల మీద ప్రత్యక్ష చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. సచివాలయంలో సోమవారం ఆయిల్‌పామ్ సాగు పథకం అమలుపై రాష్ట్రంలో పనిచేస్తున్న 14 కంపెనీల నిర్వాహకులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా సాగువిస్తీర్ణంతోపాటు కంపెనీలవారీగా పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు లక్ష్యాలను చేరుకోలేని, ఏ మాత్రం పురోగతి చూపని కంపెనీ నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. పురోగతి చూపెట్టని కంపెనీల మీద ప్రత్యక్ష చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో ఉత్పత్తి చేస్తూ వేరే రాష్ట్రాలకు ఆయిల్‌పామ్ గెలలను తరలించడాన్ని అనుమతించబోమని స్పష్టంచేశారు. ఆయా కంపెనీలు వెం టనే ఇక్కడ ఫ్యాక్టరీలు నిర్మించి, ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ మొదలుపెట్టాలని ఆదేశించారు.
కచ్చితమైన ప్రణాళిక లేకుండా, తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కంపెనీలు ప్రవర్తిస్తే సహించబోమని మంత్రి హెచ్చరించారు. ఫ్యాక్టరీ పూ ర్తయ్యేనాటికి దాని పరిధిలో కనీసం 10వేల ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యాన సంచాలకులు, మేనేజింగ్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఉద్యానశాఖ అధికారులు, ఆయిల్‌పామ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.