హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : రెండు రోజులుగా కురుస్తున్న అకాల వడగండ్ల వర్షాలకు పలు జిల్లాల్లో 2,200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, పూర్తిస్థాయి రైతువారీ పంట నష్టం అంచనాపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షాల వల్ల నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్కర్నూల్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలలో పంటనష్టం జరిగినట్టు ప్రాథమిక నివేదికలు అందాయని తెలిపారు.
దాదాపు 2,200 ఎకరాల వరకు వరి, మొకజొన్న, ఉద్యాన పంటలకు నష్టం వా టిల్లినట్టు అంచనా వేశామని చెప్పారు. వచ్చే రెండు, మూడు వారాలు అకాల వర్షాల ముప్పు ఉందని, పంట నష్టం తగ్గించేవిధంగా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. మారెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, ఇతర పం టలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అధికారులు సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్లలోనూ వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. వర్షాలకు పంటలు తడవకుండా ఉండేందుకు ఇప్పటికే 2 లక్షలకుపైగా టార్పాలిన్ కవర్లను రైతులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.