ఖమ్మం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై తెలంగాణ మంత్రిగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబితే అరవింద్‌కు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తన రాజకీయ జీవితంపై అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అరవింద్ దిగజారి మాట్లాడుతారని ఊహించలేదని విమర్శించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంత్రి తుమ్మల పర్యటించారు. బుధవారం రాత్రి అగ్నిప్రమాదంలో దగ్ధమైన పత్తి బస్తాలను పరిశీలించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం చేయడంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అగ్ని ప్రమాద ఘటనలో పత్తి బస్తాలు దగ్ధం అవ్వడం దురదృష్టకరమని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల వాగ్దానంలో భాగంగా రూ.100 కోట్లతో మోడల్ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. రైతులకు సౌకర్యంగా ఉండేలా వరంగల్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.