హైదరాబాద్, మే 2(నమస్తే తెలంగాణ) : రైతులు సమకూర్చుకున్న గన్నీ సంచుల పైసలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. మక్కల పైసలతో పాటే గన్నీ పైసలు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం గన్నీల గోల్‌మాల్‌పై ‘గన్నీ సంచుల్లో గోల్మాల్.. కోటి రూపాయల దందా’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం మార్క్‌ఫెడ్ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ కథనంతో సప్లయర్లు, పలువురు డీఎంల దోపిడీకి అడ్డుకట్టపడటంతోపాటు రైతులకు ఎక్కువ మొత్తంలో లాభం జరుగనున్నది. ఈ కథనంపై మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారు. మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల ఖాతాల్లోనే గన్నీ సంచుల పైసలు జమ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని శనివారం జిల్లా అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు.
మక్కల విక్రయ సమయంలోనే రైతులు కొనుగోలు చేసిన గన్నీల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సప్లయర్స్‌కు చెల్లిస్తున్నట్టే రైతులకూ ఒక్కో సంచికి రూ.23.22 చెల్లిస్తామని స్పష్టంచేశారు. సప్లయర్స్ నేరుగా రైతులకు డబ్బులు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, పలు జిల్లాల్లో గన్నీల సరఫరాలో జరుగుతున్న అవకవతకలు, రైతులకు తక్కువ చెల్లింపు, కమీషన్లు తీసుకోవడంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. రైతులకు నేరుగా డబ్బులు చెల్లించిన అంశం, తక్కువ ధర చెల్లిస్తూ ఎక్కువ బిల్లులు పెడుతున్న విషయంపై పూర్తి నివేదిక అందించాలని ఆదేశించినట్టు సమాచారం.