హైదరాబాద్: సింగరేణి జోలికొస్తే తెలంగాణ భగ్గుమంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. సింగరేణి తెలంగాణ హక్కు అని, దానిని ప్రైవేటీకరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. బొగ్గుగనులపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకమయ్యేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది బీజేపీ పతనానికి నాంది పలుకుతుందన్నారు. తెలంగాణపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు వ్యతికేరంగా సికింద్రాబాద్లో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి తలసాని పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతుందని.. రాష్ట్రానికి బీజేపీ నేతలు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఓడిపోతామని తెలిసి కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సింగరేణి జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ పరిశ్రమను అమ్ముతున్నారని, ఇంకెన్ని పరిశ్రమలను ప్రైవేటుపరం చేస్తారని పేర్కొన్నారు.