హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తించిన పర్యాటక ప్రాంతాలు ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యానికి గురైనట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాభివృద్ధికి పెద్దపీట వేసినట్టు కొనియాడారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సింగపూర్‌లోని టూరిజం ప్రమోషనల్ డిజిటల్ మార్కెటింగ్‌కు చెందిన ప్రముఖ సంస్థ యూనిక్యూ ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. తెలంగాణ టూరిజం ప్రమోషన్‌పై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ మంత్రి పరిశీలించారు.
తెలంగాణలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలకు ఏసియా పసిఫిక్ దేశాలైనా మలేషియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, హాంకాంగ్, థాయిలాండ్ లాంటి దేశాల్లో తెలంగాణ టూరిజం డిజిటల్ ఫెయిర్, ఫిజికల్, రోడ్‌షోలు, ట్రావెల్స్ త్రాడెక్స్, ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్ టూరిజం ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించే అంశాలపై వారితో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, అద్భుతమైన జలపాతాలు, సుందరమైన నదీ ప్రాంతాలు, ఎకో అర్బన్ పార్క్‌లు, అటవీ ప్రాంతాలు, ప్రాచీన కట్టడాలు, కోటలు, చారిత్రక సంపద, పురావస్తు, వారసత్వ సంపద, ఆధునిక జీవనశైలి అంశాల్లో రాష్ర్టానికి గుర్తింపు వచ్చేలా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్టు తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి వివిధ దేశాల్లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో టూరిజం డైరెక్టర్ నిఖిల, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, సింగపూర్ దేశానికి చెందిన యూనిక్యూ సంస్థ ప్రతినిధులు కెప్టెన్ కేపీ తాన్, సేబాష్టియన్, లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.