హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): అతి త్వరలోనే నీరా కేఫ్‌ను ప్రారంభించేందుకు ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే నీరాను పారదర్శకంగా సేకరించడం, భద్రపరచడం, ప్యాకింగ్ చేయడం వంటి వాటిపై ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో స్వచ్ఛమైన నీరా.. ఆల్కహాల్ దశకు మారకమునుపే వినియోగదారుడికి చేరవేసే ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. రంగారెడ్డి జిల్లా ముద్విన్లోని నీరా సేకరణ కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా.. అక్కడి నుంచి చేసిన ప్రయోగాలన్నీ విజయవంతం అయ్యాయి. గౌడన్నలకు ఉపాధి కల్పిస్తూనే.. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన నీరాను అందించేందుకు ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషి చేస్తున్నారు. భువనగిరి జిల్లాలోని నందనం వద్ద, రంగారెడ్డి జిల్లాలోని ముద్విన్, సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి, నల్లగొండ జిల్లాలోని సర్వేల్లో నీరా సేకరించే కేంద్రాల కోసం ప్రభుత్వం ద్వారా రూ.8 కోట్లు మంజూరు చేయించారు.
నీరా సేకరణకు చిల్లర్ బాక్సులు
చెట్టు నుంచి స్వచ్ఛంగా ఉత్పత్తి అయ్యే నీరాను కనీసం చేతితో తాకకుండా.. అదే స్వచ్ఛతతో వినియోగదారుడికి చేర్చేందుకు పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తున్నది ఆబ్కారీ శాఖ. ఇందుకోసం కేరళ తరహాలో 5 లీటర్ల సామర్థ్యం గల మట్టి కుండలను ప్రత్యేకంగా తయారు చేయించారు. ప్రత్యేకంగా కేరళలోనే తయారు చేయించి.. దాదాపు 2 వేలకు పైగా చిల్లర్ బాక్స్‌ను రాష్ర్టానికి తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిల్లర్ బాక్సుకు రెండు రంధ్రాలుంటాయి. ఒకవైపు గెలకు పెట్టడానికి, మరోవైపు ఐస్జెల్ ప్యాక్స్ వేయడానికి.. నీరా తీయడానికి ఇవి ఉపయోగపడుతాయి. ఇందుకు ప్రత్యేకంగా క్యాప్ కూడా ఉంటుంది. ఈ చిల్లర్ బాక్సుల్లో ఒక భాగాన్ని గెలకు కడతారు. లోపల ఫుడ్ గ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. దాని చుట్టూ ఐస్ జెల్‌ప్యాక్స్ వేస్తారు. దీంతో ఒక్కో కుండలో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. దానివల్ల నీరా పాడవకుండా అదే స్వచ్ఛతతో నిల్వ ఉంటుంది.
చెట్టు నుంచి నేరుగా కేంద్రానికే..
చెట్టుపై నుంచి తీసిన నీరాను కిందికి దించిన వెంటనే ఫుడ్గ్రేడబుల్ కవర్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐస్ బాక్సుల్లోకి డంప్ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా చిల్లర్ వాహనాలను కూడా సిద్ధం చేశారు. ఆ ఐస్ బాక్సుల ద్వారా సేకరణ కేంద్రానికి వచ్చిన నీరాను.. ఉష్ణోగ్రతల్లో తేడా రాకుండా ప్రత్యేకమైన ఫ్రీజర్లలో భద్రపరుస్తారు. ఇలాంటి ఫ్రీజర్లు అన్ని నీరా సేకరణ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రయాణం మొత్తంలో ఎక్కడా కూడా నీరా ఉష్ణోగ్రతలు మైనస్ 4 డిగ్రీలకు తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే నీరా సున్నా నుంచి 6 డిగ్రీలు దాటితే.. ఆల్కహాల్ తయారువుతుందనేది పరిశోధనల్లో వెల్లడైంది.
పీహెచ్ పరీక్షించిన తర్వాతే..
చెట్టు నుంచి నీరాను సేకరించి మార్కెటింగ్ చేసే క్రమంలో ఎక్కడా ఏ చిన్న తప్పు జరిగినా రంగు మారిపోతుంటుంది. సరైన ఉష్ణోగ్రతలు లేకపోతే రంగు మారే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎప్పటికప్పుడు నీరా పీహెచ్ పరీక్షిస్తారు. ఎక్కడైనా తేడా జరిగితే.. వెంటనే దానిని బైప్రొడక్ట్స్ కోసం పంపిస్తారు. అక్కడ నీరా 10 డిగ్రీల వరకు చేరుకున్నా ఇబ్బందేమీ ఉండదు. నీరాతో సహా.. అది ఉత్పత్తి అయ్యే చెట్ల నుంచి వచ్చే ఏ ఉపఉత్పత్తులైనా కచ్చితంగా ల్యాబ్ ద్వారా పరీక్షించాల్సిందే. ల్యాబ్ వారు పరీక్షించిన ఉత్పత్తులనే మార్కెట్లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నీరా బాటిల్‌ను మైనస్ 4 డిగ్రీలలో మెయింటెన్ చేయడం వల్ల వారం రోజుల వరకు దానిలోని తాజాదనం అలాగే ఉంటుంది.
చుక్క నీరా వృథా కాదు
ఇతర రాష్ర్టాల్లో నీరా లాంటి ప్రకృతి పానీయాలను నిల్వ చేయడానికి కొన్ని ప్రిజర్వేటివ్స్‌ను ఉపయోగిస్తున్నారని తెలిసింది. మన దగ్గర మాత్రం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండానే నేరుగా వినియోగదారుడికి అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మార్కెట్లో దొరికే యాంటీ ఫార్మెటెడ్ సొల్యూషన్స్‌ను ఉపయోగిస్తే నేచర్ వాల్యూ తగ్గిపోతుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రకృతి నుంచి నీరా ఎంత స్వచ్ఛంగా వచ్చిందో.. అలానే వినియోగదారుడికి అందాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఏదైనా పొరపాటు జరిగినా.. రంగుమారినా.. నీరాతో బై ప్రోడక్ట్స్ చేసేందుకు కూడా ఆబ్కారీ యంత్రాంగం సిద్ధపడింది. నీరా ఒక్క చుక్క కూడా వృథా కాదు.
– శ్రీనివాస్‌గౌడ్, ఆబ్కారీశాఖ మంత్రి