మహబూబ్ నగర్, జూలై 10 : మన దేశం కంటే వైశాల్యంలో ఎంతో చిన్నగా ఉన్న దేశాలు సైతం అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని కానీ, స్వాతంత్రం ఏర్పడిన తర్వాత దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల తీరువల్ల దేశం నేటికీ అభివృద్ధి చెందలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఒకప్పుడు ఎంతో వెనుకబడిన దక్షిణ కొరియా లాంటి దేశాలు నేడు ఎంతో అభివృద్ధి చెందాయని మంత్రి తెలిపారు.
జిల్లా కేంద్రంలోని వీరన్నపేట నీలకంఠ స్వామి దేవాలయం కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు తాళ్ల శ్రీనివాసులు సహా ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మందికి పైగా మంత్రి సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు నీలకంఠ స్వామి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల దక్షిణ కొరియాలో అధికారిక పర్యటన నిర్వహించామని, ఒకప్పుడు ఆర్థికంగా ఎంతో వెనుకబడిన ఆదేశం నేడు ప్రపంచంలోనే టాప్ టెన్ దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బిజెపి పార్టీల అర్థమర్థ విధానాల వల్లే దేశం అభివృద్ధి చెందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన రాష్ట్రం అభివృద్ధిలో మిగతా రాష్ట్రాల కంటే ఎంతో ముందుందని తెలిపారు.
దేశ విదేశాల్లో ఉన్న పర్యాటక సొబగులను మహబూబ్‌నగర్‌కు తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి స్థానికుల జీవనోపాదులు పెంచుతామన్నారు. ఎన్నికల అప్పుడు మాత్రమే వచ్చి కులం, మతం పేరిట రాజకీయం చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కో ఆప్షన్ సభ్యులు జ్యోతి, రామలింగం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు, పార్టీ నాయకులు లక్ష్మణ్, సత్యనారాయణ, నవకాంత్, చంద్రకాంత్, వర్ద భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.