మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 30 : గొర్రెల పంపిణీతో లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని జైనల్లీపూర్, కోడూర్, మాచన్‌పల్లి గ్రామాలకు చెందిన 18 మందికి రెండో విడత కింద ఆదివారం జిల్లా కేంద్రంలో గొర్రెలను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో వీరశైవ లింగాయత్ వధూవరుల పరిచయ వేదికను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశవ్యాప్తం కావాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్టు చెప్పారు. గొర్రెలను పంపిణీ చేయడంతో సంపద పెరిగిందని అన్నారు. గురుకులాల ద్వారా బడుగు, బలహీన వర్గాలకే కాకుండా అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా కేజీ టు పీజీ ఉచిత విద్య అందుతున్నదని తెలిపారు.
పథకాలను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కుట్రలకు తెరలేపుతున్నాయని మండిపడ్డారు. కర్ణాటక, మహారాష్ట్ర భక్తులతోపాటు లింగాయత్‌లకు ఎంతో పవిత్రమైన అక్కమహాదేవి గుహలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.1.60 కోట్లతో కృష్ణానదిని ఆనుకొని ఉన్న అక్కమహాదేవి గుహ వద్ద మెట్లు, జెట్టి ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి బస వ భవన్‌ను మూడు వేల గజాల్లో నిర్మించినట్టు తెలిపారు. అనంతరం బీజేపీకి చెందిన ముఖ్యనాయకులు ఆంజనేయులు, వెంకటేశ్, అరుణ్, స్వామి, శ్రీనివాస్‌తో సహా 150 మంది మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.