చౌటుప్పల్: ‘‘మునుగోడుకు సీఎం కేసీఆర్ ఏం చేసిండని ఎన్నికల ప్రచారంలో ప్రశ్నించే వాళ్లకు ఒక్కటే సమాధానం… మంచి నీళ్లు’’ అని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని పార్టీ నేతలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. 70 ఏండ్ల స్వాతంత్య్రంలో ఫ్లోరోసిస్‌తో బాధపడుతూ.. ఈ ప్రాంతంలో పుట్టడమే శాపంగా భావిస్తున్న ప్రజలకు దాన్నుంచి విముక్తి కలిగించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదే అని అన్నారు.
మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని టీఆర్ఎస్ (బీఆర్ఎస్), సీపీఎం, సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు పోలింగ్ రోజు వరకు సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఏ ఒక్క కార్యకర్త కూడా ప్రలోభాలకు లొంగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో… కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, దళిత బంధు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు స్వామిగౌడ్, బొంగు నగేశ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.