మహబూబ్‌నగర్ : దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకుతుందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామ సమీపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గతంలో రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, ఉమ్మడి ఏపీలో విద్యుత్ కోసం ధర్నా చేస్తే కాల్చి చంపిన సంఘటనలు మరిచిపోలేదన్నారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత సాగునీరు, ఉచిత విద్యుత్ రైతు బంధు, రైతువేదికలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించి వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసినట్లు చెప్పారు. దీంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక పంటలు పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని, గతంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఎక్కువ పంటలు పండించే రాష్ట్రాలుగా ఉండేవన్నారు. ప్రస్తుతం వాటిని మించిపోయి ప్రస్తుతం దేశానికే అన్నంపెట్టే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి చెప్పారు. దేశానికి కరువొచ్చినా తెలంగాణ ఆదుకుంటుందన్నారు.
మనిషికి కావాల్సింది వ్యవసాయం, ఉపాధి సామాజిక న్యాయమని, దేశానికే అన్నంపెట్టే రైతన్నకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. దేశంలో రైతు నిజాయితీపరుడని, రైతులు పుష్కలంగా పంటలు పండిస్తే ప్రజలందరూ బలోపేతం అవుతారని మంతి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, జిల్లా రైతుబంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.