మహబూబ్‌నగర్ అర్బన్/మహబూబ్‌నగర్, అక్టోబర్ 1: ‘ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్‌కు వస్తాడు.. పోతాడు.. కానీ ఈ ప్రాంతానికి చేసేది మాత్రం ఏమీ ఉండదు.. ఆయనకు ఈ ప్రాంతమంటేనే ద్వేషం’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీ ఇచ్చి ఇప్పటికే మూడుసార్లు మోసం చేశారని, మళ్లీ ఈ ప్రాంత ప్రజలను వంచించేందుకు మరోసారి పర్యటించారని ధ్వజమెత్తారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో 11 మందికి బీసీ చేయూత, 23 మంది లబ్ధిదారులకు మైనార్టీ బంధు చెక్కులను పంపిణీ చేశారు. 200 మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
జిల్లా కేంద్రంలో గౌడ, కమ్మ సంఘాల ఆత్మీయ సమ్మేళనాలకు హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ బీసీ అయినా చేసిందేమీలేదని విమర్శించారు. బీజేపీ నేతలు.. కులం, మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారని ధ్వజమెత్తారు. తన ఎదుగుదల, జిల్లా ప్రజలు ఆదరాభిమానాలను చూసి తన తల్లిదండ్రులు ఉంటే ఎంతో సంతోషపడేవారని మంత్రి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.