మహబూబ్నగర్, జూలై 13 : రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. స్వదేశంలో విమర్శిస్తే ప్రజలకు తెలుస్తుంది అనే భయంతో అమెరికాలో రేవంత్ రెడ్డి తన నిజస్వరూపాన్ని విద్యుత్ వ్యతిరేక వ్యాఖ్యలతో బయట పెట్టుకున్నాడని మంత్రి దుయ్యబట్టారు. తక్షణమే రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతంగానికి క్షమాపణలు చెప్పకుంటే వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ రైతులను అవమానించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి నిరసనగా..మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలోని విద్యుత్ భవన్ ఎదుట గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తీరును మంత్రి దుయ్యబట్టారు.
దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వల్ల రైతుకు ఎన్నడు ప్రయోజనం చేకూరలేదని.. వారి పాలనలో కరెంటు లేక రైతు ఆగమయిండని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పగటిపూట మూడు గంటలు, రాత్రిపూట మూడు గంటలు మాత్రమే కరెంటు ఇచ్చి అన్నదాత ఆగమయ్యేలా చేశారని విమర్శించారు. మళ్లీ 3 గంటల కరెంటుతో రైతును ఆగం చేయాలని రేవంత్ కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న ధరణి, నేడు కరెంటు..భవిష్యత్తులో రైతుబంధు, రైతు బీమా సహా సంక్షేమ పథకాలు ఏవీ వద్దంటడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటే ఓర్వలేక రేవంత్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ ఉద్యోగులు సిబ్బంది గ్రామాలకు వెళ్తే రైతులు, ప్రజలు దాడి చేస్తారనే భయంతో బిక్కుబిక్కుమని గడిపేవారని..తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించామన్నారు. రైతు వ్యతిరేక రేవంత్ కు రైతులే తగిన గుణపాఠం చెప్తారన్నారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, జిల్లా గొర్రె కాపరుల సహకార సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, రైతుబంధు సమితి పట్టణ అధ్యక్షుడు గోనెల రాములు, తదితరులు పాల్గొన్నారు.