పాలమూరు, నవంబర్ 14 : పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మం త్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కొత్త పింఛన్ రావాలంటే.. అప్పటికే పింఛన్ వస్తున్న వారు చనిపోతేనే అవకాశం ఉండేదని గుర్తుచేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత పింఛన్‌ను క్రమంగా పెంచామని.. ఈ సారి అధికారంలోకి వస్తే క్రమంగా రూ. 5,016కు పెంచుతామని చెప్పారు. అనంత రం తెలుగుగూడెం వ్యవసాయ క్షేత్రంలో రైతులతో ముచ్చటించారు. కూలీలతో కలిసి పొలంలో కలుపు తీశారు. ఆ తరువాత మహబూబ్‌నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ లో కాంగ్రెస్ నేతలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమం లో మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు.