Telangana | హన్వాడ, జూలై 18 : పొలానికి మూడు గంటల కరెంటు సాలదు. 24 గంటలిస్తేనే సరిపోతలేదు. కాంగ్రెసోళ్లు అట్లనే అంటరు. కేసీఆర్ సారు కరెంటె మంచిగనే ఇస్తున్నడు అని మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని దాచక్పల్లికి చెందిన పలువురు వృద్ధ మహిళలు అన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం దాచక్‌పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వస్తుండగా.. గ్రామకట్టపై పలువురు వృద్ధులు కూర్చోని ఉండగా కాన్వాయ్ ఆపి వారి వద్దకు వెళ్లారు. గ్రామానికి చెందిన సత్యమ్మ, అంజిలమ్మ, శాంతమ్మ మంత్రి కొద్దిసేపు ముచ్చటించారు.
మంత్రి: కాంగ్రెసోళ్లు వ్యవసాయానికి మూడు గంటలే కరెంట్ ఇస్తరట సరిపోతద?
వృద్ధులు: ముఖ్యమంత్రి కేసీఆర్ సారు 24 గంటల కరెంట్ ఇస్తున్నరు. అయినా పంటకు సరిపడా నీళ్లు పారుతలేవు. మూడు గంటలిస్తే ఎట్ల పారుతయి. వాళ్ల మాటలు ఎవరూ నమ్మరు.
మంత్రి: మీ కొడుకులకు కేసీఆర్ సార్ పంట పెట్టుబడి డబ్బులు వస్తున్నయా?
వృద్ధులు: మా పేర్ల మీద ఉన్న భూములను మా కొడుకుల పేర పట్టాజేసినం. వారికి డబ్బులు పడుతున్నయి.
మంత్రి: పెద్దమ్మా.. నెలకు రూ.2 వేల పింఛన్ వస్తుందా?
వృద్ధులు: తెలంగాణ రాకమునుపు రూ.200 పింఛన్ ఇచ్చెటోళ్లు. కేసీఆర్ వచ్చినంక నెలకు 2 వేలు ఇస్తున్నరు. ఆయన (సీఎం కేసీఆర్) సల్లంగుండాలి.
మంత్రి: ఇప్పుడు ఎన్నికలొస్తే ఎవరికి ఓటేస్తారు?
వృద్ధులు: గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరం కారు గుర్తుకే ఓటేస్తాం. మాకు మంచిగా చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు కాక ఇంకెవరికి ఓటేస్తాం.
ఓటుతో రేవంత్ దవడ పగలగొడుతం
అమెరికాలో తినరాని తిండితినే రేవంత్ మస్తి మాటలు మాట్లాడిం డు. మేము పండించిన పంటలనే తిని, మా లాంటి రైతులకే ఎసరు పెట్టే మాటలు మాట్లాడడానికి, స్వయంగా రైతును అని చెప్పుకోవడానికి రేవంత్‌కు సిగ్గు, శరం ఉండాలి. ఓటు తో రేవంత్ దవడ పగలగొడుతం. గత ఎన్నికల్లో కొడంగల్‌లో తంతే హైదరాబాద్‌లో పడ్డడు. ఈసారి ఎన్నికల్లో హైదరాబాద్‌లో దవడ మీద కొడితే అమెరికాలో పడాలి. కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన రెండు పూటల కరెంట్‌తో ఒక పంటకు మూడుసార్లు మోటర్లు కాలేవి. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్‌తో పండిన పంటలకు సంచులు దొరకడం లేదు. దేశానికే నేడు నాలాం టి తెలంగాణ రైతన్నలం అన్నం పెడుతున్నం. రోజూ పేపర్లో కనబడటానికి ఆయన చేసే ప్రయత్నమే తప్ప, తెలంగాణ ప్రజల బాగు కోసం ఏనాడూ కృషి చేయలేదు.
– జోగిని హన్మంతు, రైతు, సింగారం, నారాయణపేట జిల్లా
వాళ్లొస్తే మల్ల పాత రోజులొస్తయ్
గతంల కరంటు కోతలు మస్తుగ ఉండేవి. ఎప్పుడు వత్తదో ఎప్పుడు పోతదో తెల్వకపోవు. తెల్లవార్లు పడిగాపులు కాసేటోళ్లం. అలాంటి రోజుల నుంచి గిప్పుడు 24 గంటల కరంటును చూస్తునం. గిప్పుడు గా ఇబ్బందులు తప్పినయ్. మల్ల మొన్నటి సంది కాంగ్రెసోళ్లు ఎవుసానికి 3 గంటల కరంటు అంటాన్రు. వాళ్లు మాత్రం అధికారంల రావద్దు. వస్తె మల్ల పాత రోజులొస్తయ్. రైతులు ఆగమైతరు. రైతుల ను ఆదుకునేది కేసీఆర్ ఒక్కరే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను కాపాడుకుంటం.
– జాటోత్ ఈర్య, రైతు, చిలుకమ్మతండా, ఖానాపురం (వరంగల్ జిల్లా)
20 గుంటల మడి గూడ సక్కగ పారది
3 గంటల కరెంట్‌కు 20 గుంటల మడి గూడ సక్కగ పారది. 24 గంట ల కరెంట్ ఉంటేనే రైతులు మంచిగ సాగుజేసుకుంటరు. రైతుల కష్టాలు సీఎం కేసీఆర్ సార్‌కు ఎరుక కనుకనే ఉచితంగ కరెంట్, పెట్టుబడి సాయం, రైతుబీమా ఇస్తుండు. రేవంత్ ఎన్నడైన ఎవుసం చేసిండా? ఒకప్పుడు కరెంట్ ఎక్కువ తక్కువొచ్చి మోటర్లు కాలేవి. వాటి రిపేరింగ్ కోసం అప్పులయ్యేవి. గప్పుడు రైతులు ఆత్మహత్యలు జేసుకుంటే మాట్లాడని రేవంత్ గిప్పుడు బాగ మాట్లాడుతాండు.
– ఆకుల సుధాకర్, రైతు, చల్లగరిగె, చిట్యాల (భూపాలపల్లి జిల్లా)