హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఏర్పాటు చేయాలని తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి, ఉత్పత్తి ప్రారంభమైతే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడంతోపాటు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే ఆ ఫ్యాక్టరీ ఏర్పాటవున్నదని, దానికి అనుమతులు కూడా కేంద్రమే ఇచ్చిందని, ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన భూములను కూడా ఆ పరిశ్రమవారే సొంతంగా కొనుక్కున్నారని బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
2025-26 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని, అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇథనాల్ పరిశ్రమల అనుమతులకు సంబంధించిన విధివిధానాలు జారీ చేశారని వివరించారు. ఎవరైనా అరాచకం సృష్టించాలని చూస్తే ప్రభుత్వ యంత్రాంగాలు చూస్తూ ఊరుకోబోవని ఆయన హెచ్చరించారు. పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మద్దతుగా మంత్రి శ్రీధర్‌బాబు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులకు కేటాయించిన లక్ష్యం కంటే తక్కువ ఎరువులు ఎందుకు సరఫరా చేశారని ఎరువుల కంపెనీల ప్రతినిధులపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయంలోని తన చాంబర్లో బుధవారం ఆయన ఎరువుల కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలలో తక్కువ సరఫరా చేసిన ఎరువులను జూలైలో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలవారీగా కేటాయించిన ఎరువులను.. ఆ జిల్లాలలోనే పంపిణీ చేసేలా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. కల్తీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. కల్తీ విత్తనాలపై సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌రావుతోపాటు ఇతర అధికారులు, ఎరువులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.