Minister Sridhar babu | హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): అక్రమ నిర్మాణాలను చూస్తూ ఊరుకోవాలా? బుల్డోజర్లు వెళ్తే తప్పా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమర్థించుకున్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రాకు ఎవరైనా ఒక్కటేనని, అక్రమ నిర్మాణాలపై ఎవరినీ ఊపేక్షించేది లేదని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. మూసీ, హైడ్రా విషయంలో తమ ప్రభుత్వం చట్టబద్ధంగా, ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. హైడ్రా విషయంలో పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, పేదలు, మధ్యతరగతి వారి నివాసాల విషయంలో ప్రభుత్వం తొందరపడదని, అపార్ట్మెంట్ నిర్వాసితులకు ఎలా న్యాయం చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి యోచిస్తున్నారని వివరించారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, ఎవరికీ అన్యాయం జరగదని తెలిపారు. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. మూసీ ప్రక్షాళన కోసమే మూసీ రివర్ ఫ్రంట్‌తో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. మూసీ రివర్ బెడ్లోని అక్రమ నిర్మాణాలనే తొలగిస్తున్నట్టు తెలిపారు.
ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శాన్ఫ్రాన్సిస్కోలో తెలుగు కమ్యూనిటీ మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత సైతం ప్రభుత్వానిదేనని చెప్పారు. పేదలను అడ్డంపెట్టి కొందరు బిల్డర్లు అక్రమ నిర్మాణాలను చేపట్టి, వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్.. అని పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణం పేరిట ఆ రాళ్లు కనుమరుగైపోయాయని, చెరువులను కబ్జాచేసి ఇండ్లు కట్టుకున్నారని, పార్కులు లేకుండా పోయాయని వివరించారు. మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని, డబుల్ బెడ్రూం ఇండ్లు, చదువులు, ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్, స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం పాల్గొన్నారు.