రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వాలంటే కుదరదు. రాష్ట్రంలో ప్రస్తుతం వేల సంఖ్యలో గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నరు. అందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉపాధి కల్పించాలంటే ఎలా సాధ్యం?
హైదరాబాద్, జనవరి 6 (నమస్తేతెలంగాణ) : నిరుద్యోగ అభ్యర్థులందరికీ సర్కా ర్ కొలువులు ఇవ్వలేమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కుండబద్దలు కొ ట్టారు. రెండేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లు కుమ్మరించారు. ఏటా రెండు లక్ష ల ఉద్యోగాలు అని చెప్పిందంతా.. జాబ్ క్యాలెండర్ అని డబ్బా కొట్టిందంతా బోగ స్ అని చెప్పకనే చెప్పారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భం గా కాంగ్రెస్ సభ్యులు వెంకట్, భానుప్రసాద్, బీజేపీ సభ్యులు కొమరయ్య, అంజిరెడ్డి, సీపీఐ సభ్యుడు నెల్లికంటి సత్యం అడిగిన ‘రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు -పెట్టుబడులు’ అనే అంశంపై మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ప్రభుత్వ రంగంలోనే ఉపాధి అవకాశాలు అంటే కు దరదు. ప్ర స్తుతం రాష్ట్రం లో వేలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లుగా ఉండి.. ఉపాధి లేని వారికి ఉద్యోగావకాశాలు కల్పించినం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినం. ఈ ఉద్యోగాల్లో అత్యధికులు బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల అభ్యర్థులే ఉన్నారు’ అని చెప్పారు.గ్రూప్-1,గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. జాబ్ క్యాలెండర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారని, దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఎస్సీ, బీసీ రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకొని జాబ్ క్యాలెండర్‌ను రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.