హైదరాబాద్, జనవరి 3(నమస్తే తెలంగాణ): శాసనసభలో శనివారం కృష్ణా నీళ్లపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఒకవైపు మంత్రి ఉత్తమ్‌కుమార్.. సీరియస్‌గా ప్రజెంటేషన్ ఇస్తుంటే, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కునుకుతీశారు. ఈ విషయాన్ని గమనించిన శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వారిని నిద్రలేపే ప్రయత్నం చేశారు. ‘వెనుకాల మీ ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు. వారిని లేపండి’ అని సూచి స్తూ బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి చీటీ రాసి పం పించారు.
ఆ లేఖ చూసిన మహేశ్వర్‌రెడ్డి వెంటనే తన సీట్లో నుంచి లేచి వెనుక సీట్ల వద్దకు వెళ్లి నిద్రిస్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, ధన్పాల్, రామారావు పాటిల్‌ను నిద్రలేపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం నిద్ర మత్తులోకి జారుకున్నారు. సభలో కూర్చున్న వారంతా అతికష్టంపై నిద్రను నియంత్రించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ప్రభుత్వం కృష్ణా నీళ్లపై ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ తీవ్రత ఎలాంటిదో ఎమ్మెల్యేల తీరుతో అర్థమైందనే చర్చ జరుగుతున్నది. సభలో ఉన్న ఎమ్మెల్యేలకే ప్రజెంటేషన్‌పై పట్టింపులేదని, ఇక ఆ ప్రజెంటేషన్‌ను ఎవరు పట్టించుకుంటారనే అభిప్రాయం వ్యక్తమైంది.