హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ఐటీ, పురపాలకశాఖ మంత్రి శ్రీధర్‌బాబు సీరియస్ అయ్యారు. ఇదీ ముమ్మాటికీ ఇంటెలిజెన్స్ వైఫల్యమేనని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మంగళవారం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణరెడ్డి తదితర ఉన్నతాధికారులు రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబుతో సచివాలయంలోని ఆయన చాంబర్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సోమవారం నాటి లగచర్ల ఘటనపై ఆరా తీశారు. ఫార్మా కంపెనీకి భూములిచ్చే రైతాంగం ఆగ్రహంగా ఉన్నప్పటికీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఎందుకు సమాచారం అందించలేదని నిలదీసినట్టు వినికిడి.
ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి గుడ్డిగా రైతులు దీక్ష చేస్తున్న ప్రాంతానికి కలెక్టర్ ఎందుకు వెళ్లారు? ఇందుకు పోలీసులు ఎందుకు అనుమతించారు? అని ప్రశ్నల వర్షం కురిపించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రైతుల భూములను గుంజుకుంటామని ఎందుకు ప్రకటించారని కొడంగల్ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డట్టు సమాచారం. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఊపేక్షించబోమని హెచ్చరించినట్టు అక్కడి వర్గాల ద్వారా తెలిసింది. కాగా, మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఉన్నతాధికారులు ముభావంగా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని లగచర్లలో సోమవారం జరిగిన ఘటపై సమగ్ర విచారణ చేపడతామని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. కొందరు కుట్రపూరితంగా అమాయకులైన అక్కడి రైతులను ఉసిగొల్పి ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌పై దాడి చేయించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అభ్యంతరాలుంటే చెప్పవచ్చని, హింసకు తావులేదని ఖండించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోదని తేల్చిచెప్పారు.
మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకున్నవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. లగచర్ల ఘటనకు సంబంధించి పోలీసు అధికారుల వైఫల్యముంటే విచారణ చేపట్టి బాధ్యులపై కూడా చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. యంత్రాంగంలోనూ లోపాలుంటే సరిదిద్దుకుంటామని చెప్పారు.