Minister KTR | కాంగ్రెస్ అధికారంలో ఉన్న 50 సంవత్సరాల్లో రాష్ట్రంలో సక్రమంగా పని చేస్తే ఈ సమస్యలెందుకుంటయ్.. ఈ యాత్రలెందంటూ ఆ పార్టీ నేతలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో డబుల్ బెడ్రూం గృహ సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మిషన్ కాకతీయలో బాగు చేసుకున్న చెరువులకాడ నిండిన నీళ్లను చూస్తూ పండగ చేసుకున్నాం. దేవరకద్ర నియోజకవర్గంలో ఓ పరిశ్రమకు భూమిపూజ చేశాం. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు శంకుస్థాపన చేశాం.
జడ్చర్లలో లక్ష్మారెడ్డి నాయకత్వం 560 డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు అందించే కార్యక్రమాలను మృగశిర కార్తె నాడు చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. మహబూబ్‌నగర్‌కు హెలికాప్టర్లో వస్తూ పైనుంచి చూస్తుంటే ఎర్రటి ఎండాకాలంలో నిండుకుండల్లా మారి.. మత్తళ్లు దుంకుతున్నయ్. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హెలికాప్టర్ నుంచి ఉద్దండాపూర్, కరివెన ప్రాజెక్టులను చూపించారు. ఈ ప్రాజెక్టులు నిండితే 1.44లక్షల ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి మీతో సంతోషాన్ని మీతో పంచుకుంటున్నారు. ఒకసారి కృష్ణా నీరు జడ్చర్లకు వస్తే దశాబ్దాల పాలమూరు గోస, పీడపోతుంది.. నా జన్మ ధన్యమవుతుందని రైతుల సంతోషాన్ని మీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాతో పంచుకున్నారు’ అని కేటీఆర్ తెలిపారు.
‘ఒక నాయకుడికి, ప్రజాప్రతినిధికి ప్రజలపై ఏమవుందో ఇదొక ఉదాహారణ చాలు. మిడ్జిల్‌లో చెక్‌డ్యామ్‌లు కడితే 5వేల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. నియోజకవర్గంలో 628 చెరువులుంటే రూ.80కోట్లతో 371 చెరువులకు మరమ్మతులు చేశాం. వాటితో గంగపుత్రులు, ముదిరాజ్‌లకు, రైతులకు లాభం జరిగిందని చెరువుల పండుగ సందర్భంగా లక్ష్మారెడ్డి సంతోషంతో చెబుతున్నారు. తొమ్మిదేళ్లు నిండి పదేళ్లలో అడుగుపెడుతున్న తెలంగాణలో కొంత సంతోషకరమైన వాతావరణంలో పండగ చేసుకునే ప్రయత్నంలో మనమున్నాం. 15రోజల కిందట కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడకు వచ్చారు. వచ్చి మంచి మనిషి లక్ష్మారెడ్డిని నోటికి వచ్చినట్టు తింటిపోయిండు. కాంగ్రెస్ అధ్యక్షుడికి నోటిదూల ఎక్కువ.
ఇది వరకు వచ్చిపోతే తిట్టిపోతే 45వేల మెజారిటీతో లక్ష్మారెడ్డిని మీరు గత ఎన్నికల్లో గెలిపించారు. ఈ సారి లక్ష్మారెడ్డిని 90వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిపించి ఆ సన్నాసులకు సమాధానం చెప్పాలి. ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఆలోచన చేయాలి. కాంగ్రెసోళ్ల కథ ఎట్లనున్నదంటే.. ఒకాయనేమో రోడ్లు పట్టుకొని తిరుగుతున్నడు. 750 కిలోమీటర్ల తిరిగినా అంటున్నడు.. నిన్ను ఎవరు తిరుగుమన్నరు.. ఇంత గోసనీకెందుకొచ్చింది. మీరున్ననాడు 50 సంవత్సరాలు సక్కగా పని చేస్తే ఈ సమస్యలు ఎందుకుంటయ్..? ఈ యాత్రలు ఎందుకుంటయ్..? 50-55 సంవత్సరాలు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించింది కాంగ్రెస్ కాదా? 2014 ముందు పరిస్థితి ఎట్ల ఉండేది. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటీ? ఆడబిడ్డల పరిస్థితి ఏందీ? తాగు, సాగునీటి పరిస్థితేంటీ? ఎలా ఉండేదో ఒకసారి పరిస్థితి గుర్తు చేసుకోవాలి’ అన్నారు.
‘ఆనాడు ఇదే జడ్చర్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో కరెంటు సక్కగా రాక సుట్టమో.. తెలిసినాయన చనిపోతే మనమే కదా కరెంటోళ్లకు ఫోన్ చేసి బతిమిలాడుకున్నాం. అన్నా అరగంట కరెంటియ్యి. బాయికాడికి పోతున్నాం. స్నానాలు చేయాలి. దండంపెడుత ఓ అరగంట కరెంటియ్యి అని బతిమిలాడుకున్న పరిస్థితులను మరిచిపోదామా? ఇవాళా ఆ పరిస్థితి ఉన్నదా? కాంగ్రెస్ ఉన్న సమయంలో రైతులకు ఆరుగంటల కరెంటు వచ్చిందా? ఆ కరెంటును రెండు దఫాలుగా ఇస్తుండే. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవుడు. మోటార్లు పేలిపోతయ్. కరెంటు రాదు.. వచ్చినా పారిన మడే పారుతది తప్ప కింద మడి పారే పరిస్థితి లేకపోయేది.
అట్లుండే కాంగ్రెస్ పరిపాలన. తాగునీటి కోసం గోస. మహబూబ్‌నగర్‌లో 14 రోజులకొకసారి తాగునీరు వచ్చేది. జడ్చర్లలో పరిస్థితులు ఎలా ఉండేవో మీకే తెలుసు. ఎండకాలం వచ్చిందంటే ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలకు భయపడుతుంటే. ఏ ఊరికి వెళ్తే బిందెలు అడ్డం పెడుతరో.. బోర్లు అడుగుతరో భయపడే పరిస్థితులు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితులు ఉన్నాయా? మిషన్ భగీరథతో కడుపునిండా నీళ్లు వస్తున్న మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పాలి’ అనగా.. సభా ప్రాంగణమంతా చప్పట్లతో దద్దరిల్లింది.
‘75 సంవత్సరాల్లో ఏ కాంగ్రెస్ సన్నాసి నాయకుడు చేయని ఆలోచన చేసి రూ.43-44వేల కోట్లతో ఇంటింటికి నల్లా పెట్టి భారతదేశ స్వాతంత్య్రం అనంతరం ఓ ముఖ్యమంత్రి ఆలోచన చేసి నీళ్లిచ్చిన మాట వాస్తవం కాదా? హైదరాబాద్ బంజారాహిల్స్ దొరుకుతున్న నీళ్లు… జడ్చర్లలో బంజారాతండాలో వస్తున్న మాట వాస్తవం కాదా? ఉద్దండాపూర్, కరివెన రిజర్వాయర్ 90శాతం పనులు పూర్తయిన మాట వాస్తవం కాదా? పాలమూరు – రంగారెడ్డి పథకాన్ని కాంగ్రెస్ పట్టించుకోకపోతే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఎన్ని కేసులు పెట్టినా, కోర్టులతో అడ్డుకునే ప్రయత్నం చేసినా బీజేపోళ్లు కృష్ణా జలాలు పంచకపోయినా వాయువేగంతో పూర్తి చేసుకుంటూ ఆగస్ట్, సెప్టెంబర్ నాటికి కరివెన, ఆ తర్వాత రెండు మూడు నెలలకు ఉద్దండాపూర్ నిండి జడ్చర్ల నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది’ అని ప్రకటించారు.