Minister KTR | వనపర్తి టౌన్, సెప్టెంబర్ 22 : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 29న వనపర్తి పర్యటనకు వస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు ఊహించినదానికంటే ఎక్కువగానే అభివృద్ధి చేశానని తెలిపారు. రాష్ట్రస్థాయిలో వ్యవసాయ శాఖకు వన్నె తీసుకొచ్చానని చెప్పారు. 29న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా రూ.10 కోట్లతో చేపట్టనున్న ఐటీ టవర్, రూ.50 లక్షలతో జర్నలిస్ట్ భవనం, రూ.5 కోట్లతో పెబ్బేరు సంత అభివృద్ధి, టఫ్ ఐడీసీ కింద మంజూరైన మరో రూ.50 కోట్లతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థానన చేస్తామని తెలిపారు.
వనపర్తిలో దాదాపు రూ.200 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. జర్నలిస్ట్‌లందరికీ త్వరలో ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. చెరువుల పునరుద్ధరణతో పట్టణాల్లో భూగర్భజలాలను వృద్ధి చేస్తుంటే.. మాజీ మంత్రి చిన్నారెడ్డి అవగాహనా రాహిత్యంతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 270 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మెషిన్లు పంపిణీ చేశారు.