వనపర్తి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లాకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా పనిచేసినట్టు తెలిపారు.
2016లో ఇచ్చి మాట ప్రకారం వనపర్తి జిల్లా ఏర్పాటు చేశారని, ఎంజీకేఎల్ఐ కింద ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాల్‌ను నిర్మించి పుష్కలంగా సాగునీరందిస్తున్నట్టు చెప్పారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సీఎం సహకారంతో ప్రజల చిరకాల కోరికను నెరవేరుస్తున్నామని అన్నారు. ఏదుల రిజర్వాయర్ ద్వారా వనపర్తికి సాగునీటి సమస్య పూర్తిగా తొలిగిపోనున్నదని, నియోజకవర్గంలో దాదాపు 1.25 లక్షల ఎకరాలకు సాగు నీరందుతున్నదని తెలిపారు.