హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయటం కేం ద్రంలోని బీజేపీ సర్కార్ కక్షపూరిత చర్య కు నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేకే ఎమ్మెల్సీ కవితపై ఈడీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ భ్రష్టు పట్టించి, వాటి విశ్వసనీయతను దెబ్బతీసిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన అదానీపై మోదీ సర్కారు నోరెందుకు మెదపదని నిలదీశారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో ఎమ్మెల్యేలను కొని అక్రమంగా ప్రభుత్వాలు ఏర్పాటుచేసి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. తమ మాటవినని వారిపై కేంద్రం కేసులు పెడుతున్నదని, మోదీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.