జనగామ, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : జనగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు గూండాయిజం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై దాడికి యత్నించగా, బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించి అడ్డుకున్నాయి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి మద్యం మత్తులో తూగుతున్న అనుచరగణంతో కలిసి ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ పల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో కొమ్మూరి వర్గం నాయకులు, ఆయన కుమారుడి అనుచరగణం బీఆర్ఎస్, ఎమ్మెల్యే, కేసీఆర్‌ను నిందిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకొని ప్రతి నినాదాలతో కౌంటర్ అటాక్ చేయడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మద్యం మత్తులో ఎమ్మెల్యేపై దాడికి యత్నించిన కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు పక్కకు తీసుకెళ్లినా వారిని తోసుకుంటూ పెనుగులాటకు దిగాడు.
అధికారికంగా జరుగుతున్న మంత్రి సీతక్క పర్యటనలో అడుగడుగునా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి, చేర్యాల మాజీ ఎమ్మెల్యే కుమారుడు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి తన మార్క్ గూండాగిరిని ప్రదర్శించాడు. పట్టణంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి పర్యటనను రసాభాస చేసుకోవద్దని, కాంగ్రెస్ నాయకులు కావాలని గొడవ సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రహించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులను పలుమార్లు సముదాయించారు. అయిప్పటికీ తన అనుచరగణాన్ని ఎమ్మెల్యే పల్లాపైకి ఉసిగొల్పి దూషణల పర్వాన్ని కొనసాగించారు. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డితోపాటు అతడి అనుచరగణం అడ్డుపడటమేంటని ఎమ్మెల్యే పల్లా పోలీసులను ప్రశ్నించడంతో సీఐ సత్యనారాయణరెడ్డి కాంగ్రెస్ నాయకులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. ఈ వివాదంపై మంత్రి సీతక్క సైతం అసహనం వ్యక్తంచేశారు.
‘మంత్రి సీతక్క పాల్గొనే అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకులకు మద్యం తాగించి తీసుకొచ్చి నాపై దాడికి ప్రయత్నించారు..అడుగడుగునా అడ్డుకుంటూ కల్లు తాగిన కోతుల్లా ప్రవర్తించారు’ అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం జనగామలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ గూండాల తీరుపై మండిపడ్డారు. గూండాగిరితో కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేయాలను కుంటే ప్రజలు ఊరుకోరు అని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ముందు జనగామలో ప్రశాంతతను చెడగొట్టే శక్తులను పట్టణ ప్రజలే తిప్పికొడతారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో జనగామలో ఎగిరేది గులాబీ జెండానే అని స్పష్టంచేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. మంత్రి ప్రారంభించిన పనులన్నీ నాలుగేండ్ల క్రితమే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, ఇప్పటికి పూర్తయ్యాయని తెలిపారు. జనగామ మాజీ డీసీసీ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, అతడి కొడుకు ప్రశాంత్‌రెడ్డి తన అనుచరులకు మద్యం తాగించి కావాలనే తన మీద దాడికి ప్రోత్సహించారని ఆరోపించారు. ఎవరు రెచ్చగొట్టారో, ఎవరు అభివృద్ధి చేశారో..ప్రజల తీర్పు మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా ఉంటుందని తెలిపారు. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో మాదిరే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు.