హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా చేయకుంటే కాంట్రాక్టులు రద్దు చేస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక హెచ్చరించారు. శుక్రవారం నమస్తేతెలంగాణలో ‘అంగన్వాడీలకు కుళ్లిన గుడ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది.
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న ఆహారపదార్థాలు, కోడి గుడ్ల నాణ్యత పెంపు కోసం కాంట్రాక్టర్లతో స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి మంత్రి శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు పేదపిల్లలు వస్తారని, వారికి పోషకాహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. నాణ్యమైన గుడ్లు సరఫరా చేయడం లేదని వస్తున్న వార్తలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో వార్తలపై ఆమె సప్లయర్లను వివరణ కోరారు. సప్లయర్లు సరఫరా చేసే నాణ్యత లేని వస్తువులను తిరస్కరించాలని మంత్రి అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. సకాలంలో గుడ్లను వినియోగించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.