తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంత్రి సీతక్క (Minister Seethakka) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు మంత్రి సీతక్కు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పని ఒత్తిడి వల్ల మొక్కులు చెల్లించుకోవడం ఆలస్యమైందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
కాగా, తిరుమలలో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిథులపై టీటీడీ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంటక్ ఆరోపించారు. సోమవారం ఇరువురు నేతలు కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే తిరుమలలో తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు భద్రాచలం, యాదాద్రి ఆలయానికి వచ్చినప్పుడు వారికి ప్రొటోకాల్ అమలవుతోందన్నారు. కానీ తెలంగాణ ఎమ్మెల్యేలపై తిరుమలలో ఎందుకు చిన్నచూపు అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజా ప్రతినిధులు సిఫార్సు చేస్తే కనీసం గదులు కూడా ఇవ్వరా అని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తనకు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివని చెబుతారు, కానీ తిరుమలలో తెలంగాణ నేతల పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. టీడీపీ, వైసీపీ నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవచ్చా, ఏపీ ఎమ్మెల్యేలను రానివ్వకుండా మేం కూడా అడ్డుకోవాలా అన్నారు. తెలంగాణ ఆలయాల్లో ఏపీ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ లేకుండా ఉండాలన్నారు. దీని కోసం వచ్చే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని బల్మూరి వెంకట్, అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ప్రొటోకాల్, వారి సిఫార్సు లేఖలపై స్పందించాలని బల్మూరి వెంకట్ కోరిన విషయం తెలిసిందే.