హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
మేడారం జాతర ఏర్పాట్లపై సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్లో సీతక్క ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంశాలవారీగా సమీక్షించారు. జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనాన్ని ఈసారి జాతర సమయంలోనే నిర్వహించాలని ఆదేశించారు. తద్వారా జాతరకు వచ్చే భక్తులు గిరిజన సాంసృతిక వైభవం తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
మేడారం జాతర జాతీయ హోదా కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జాతర తదుపరి సమీక్ష వచ్చేవారంలో ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ తనకు తల్లిలాంటిదని, ఉద్యోగులు తనను సోదరిలా భావించి సమస్యలను ఎప్పుడైనా చెప్పుకోవచ్చని సీతక్క ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. సమీక్షలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, అదనపు సంచాలకుడు సర్వేశ్వర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శంకర్, ట్రైకార్ జీఎం శంకర్, టీఆర్ఐ సహా తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.