Minister Seethakka | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజినీర్లను మంత్రి సీతక్క ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామాలు, ఆవాసాలు, తండాలు, గూడేలకు ప్రతిరోజూ తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని సూచించారు.
ప్రత్యేకంగా ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పంపుసెట్ల సమస్యను త్వరితగతిన పరిషరించి వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. పగిలిపోయిన, లీకైన పైపులైన్లను గుర్తించి మరమ్మతు చేసి నీటి సరఫరాను అదే రోజు పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులను మిషన్ భగీరథ ఇంజినీర్లు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.