హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): మహిళలను గౌరవించటం, నేరాలు చేస్తే పడే శిక్షలపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని, అందుకోసం పాఠ్యాంశాల్లో ఈ అంశాలను చేర్చాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. దీనికోసం స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో మహిళల భద్రతపై ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఐదు రోజుల స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నట్టు తెలిపారు. మహిళా మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని వివరించారు.
సమాజంలో మహిళల భద్రత కోసం స్వయంసహాయక సంఘాల సహాయాన్ని తీసుకుంటామని, ఆ సంఘ సభ్యులతో గ్రామ స్థాయి నుంచి సోషల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బాధిత మహిళలు బహిరంగంగా మాట్లాడేలా ధైర్యం కల్పిస్తామని తెలిపారు. వేధింపులకు పాల్పడాలంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
రైతు రుణమాఫీ పూర్తయిన తరువాత గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తామని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం, స్వయం సహాయక సంఘాల బలోపేతం తదితర అంశాలపై జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సచివాలయం నుంచి సీతక మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీతక మాట్లాడుతూ.. స్వచ్ఛదనం-పచ్చదనం స్పెషల్డ్రైవ్లో అనుకున్న ఫలితాలు సాధించినప్పటికీ, శానిటేషన్ మెరుగుపడాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. స్వచ్ఛదనం-పచ్చదనం విజయవంతం కోసం మంచి పనితీరు కనబరిచిన సిబ్బందిని స్వాతంత్య్ర దినోత్సవం రోజు సన్మానించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ప్రతినెలలో మూడు రోజులపాటు స్వచ్ఛదనం-పచ్చదనం డ్రైవ్ కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఆయా జిల్లాల్లో పారిశుద్ధ్య లోపాలపై వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.