హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ విద్యార్థులకు త్వరలో బ్రిడ్జికోర్సును ప్రారంభిస్తామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ప్రీస్కూల్‌కు, ఫస్ట్ క్లాస్‌కు మధ్య ఈ కోర్సు ఉంటుందని చెప్పారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బంజారాభవన్‌లో గ్రేడ్-2 సూపర్వైజర్ల శిక్షణా కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లకు గ్రేడ్-2 సూపర్‌వైజర్స్‌గా ప్రభుత్వం పదోన్నతి కల్పించిందని, ఎవరి పరిధిలో వారు సమర్థంగా పని చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, కిశోర బాలికలపోషణ ఆరోగ్యం, సంరక్షణ, రక్షణ అంశాల విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మాతాశిశు సంరక్షణకు పెద్దపీట ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్, జాయింట్ డైరెక్టర్ కేఆర్ఎస్ లక్ష్మీదేవి, రీజినల్ జాయింట్ డైరెక్టర్ శారద పాల్గొన్నారు.