మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక దుర్భిక్షం పోయి సుభిక్షం అయింది. సీఎం కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచి ఆ సంపదను ప్రజలకు పెంచుతున్నదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavathi )అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజల ఆదాయం పెరిగింది, ఉపాధి అవకాశాలు పెరిగి మౌలిక సౌకర్యాలు మెరుగుపడ్డాయన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్. 2014, 2018 ఎన్నికల్లో పట్టిన గతే కాంగ్రెస్, బీజేపీకి పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అమలు కానీ హామీలను ఇస్తున్నారు. ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంటే ఇక్కడ ప్రజలు కొంతైనా నమ్మేవారని పేర్కొన్నారు.
ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి, ఇప్పుడు డబ్బులకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు కేసీఆర్ను మాత్రమే నమ్ముతారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొంటారు.