ములుగు జిల్లాలోని ప్రతి ఎకరాకు గోదావరి నీళ్లు

ములుగు : ములుగు జిల్లాలోని ప్రతి ఎకరాకు గోదావరి నీళ్లు అందిస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలో రూ. 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. వ్యవసాయాన్ని పండుగ చేసి, రైతును రాజు చేసే లక్ష్యంలో భాగంగా ఈ రైతు వేదికల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రైతు వేదికలు రైతుల సంక్షేమానికి చిహ్నాలు అని చెప్పారు. జిల్లాలోని పాలెం వాగు నిర్మానానికి రూ. 5 కోట్లు కేటాయించాం.. ఈ వాగు ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. మొండి కుంట వాగు ద్వారా కూడా నీరు వస్తుందని తెలిపారు. భవిష్యత్లో ములుగు జిల్లా రైతు అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ జిల్లాను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.