హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ అసహనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మండిపడ్డారు. తెలంగాణవాదినని చెప్పుకునే రేవంత్ తెలంగాణ కోసం చేసిన ఒక గొప్ప పని చెప్పాలని సవాలు చేశారు. ఎమ్మెల్సీ దయానంద్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని బ్లాక్మెయిల్ చేయడం రేవంత్‌రెడ్డికి అలవాటని ఆరోపించారు. బీఆర్ఎస్ను విమర్శిస్తున్న రేవంత్‌ది చీటర్స్ పార్టీయా? అని ప్రశ్నించారు. రేవం త్‌కు దమ్ముంటే రానున్న ఎన్నికల వరకు కాంగ్రెస్ నేతలను కలిపి నడిపించాలని సవాల్ విసిరారు. గద్దర్ మరణాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ ప్రజాప్రతినిధి కాకున్నా శాసనసభ, మండలిలో సంతాపం తెలిపామని గుర్తు చేశారు. ఉమ్మడి పాలనలో గిరిజనుల వెనుక బాటుకు కాంగ్రెస్సే కారణమని, స్వరాష్ట్రంలోనే గిరిజనుల అభివృద్ధి జరిగిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆదివాసీలు గుణపాఠం చెబుతారని మంత్రి హెచ్చరించారు.
తెలంగాణ కోసం చేసిన ఒక్క మంచి పని చెప్పు
తెలంగాణవాదినని చెప్పుకొనే రేవంత్ తెలంగాణ కోసం చేసిన ఒక మంచి పని చెప్పాలి. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని బ్లాక్మెయిల్ చేయడం రేవం త్‌కు అలవాటు. ఆయన బతుకేందో అందరికీ తెలుసు. దమ్ముంటే ఎన్నికల వరకు కాంగ్రెస్‌ను కలిపి నడిపించాలి
-మంత్రి సత్యవతి రాథోడ్