చేవెళ్ల రూరల్, అక్టోబర్ 4 : పుట్టిన బిడ్డనుంచి చివరి మజిలీ వరకు ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకంట్లలో బుధవారం తెలంగాణ ప్రభుత్వం అంజేస్తున్న స్పోర్ట్స్ కిట్స్, బతుకమ్మ చీరెలు పంపిణీ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీర్దే అన్నారు.
గతంలో మహిళలు బిందెలు పట్టుకొని నీటికోసం అనేక పాట్లు పడేవారని, సీఎం కేసీఆర్ హయాంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథ జలాలు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12 వేల గ్రామాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో వాటి రూపు రేఖలు మారాయని, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, హరితహారం నర్సరీలు, గ్రామీణ యువతకు అనువుగా ఉండేందుకు క్రీడా మైదానాల ఏర్పాటు తదితర వాటితో ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు.
అనంతరం ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందిస్తున్న స్పోర్ట్స్ కిట్లు, మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, కౌకుంట్ల, అంతారం సర్పంచ్లు గాయత్రీగోపాలకృష్ణ, సులోచనాఅంజన్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, ఆలూర్, తల్లారం, తంగడిపల్లి సర్పంచ్లు విజయలక్ష్మీ నర్సింహులు, గూడెం సురేందర్, అనూష సత్తయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు.