Sabitha Indra reddy | షాబాద్, ఏప్రిల్ 22 : తొమ్మిదేండ్లలో తెలంగాణకు ఏం చేశారని బీజేపీ నాయకులు చేవెళ్లలో సభ పెడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రశ్నించారు. శనివారం చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్‌షా తెలంగాణకు ఎప్పుడు వచ్చినా రాష్ర్టానికి మేలు చేసే ఒక్క ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ గత తొమ్మిదేండ్లలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల వల్ల నేడు దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని అన్నారు. ‘చేవెళ్లకు రాబోతున్న అమిత్‌షాను సూటిగా అడుగుతున్నాం.. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, దళితబంధు వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలు దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదు? రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలను దేశమంతా అమలు చేస్తామని చేవెళ్ల సభలో చెప్పగలరా? మిషన్ భగీరథ లాంటి పథకంతో దేశంలోని ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తున్నామని చెప్పగలరా? మిషన్ కాకతీయ వంటి పథకంతో దేశంలోని చెరువులు, కుంటలను బాగుచేశామని చెప్పగలరా? పల్లెప్రగతి లాంటి పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నామని చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.
కేసీఆర్‌పై విషం కక్కడమే మీ పనా?
అమిత్‌షా రాష్ర్టానికి వచ్చిన ప్రతిసారి కేసీఆర్ ప్రభుత్వంపై విషం కక్కటమే పనిగా పెట్టుకొన్నారని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ప్రశాంతంగా కలిసిమెలిసి బతుకుతున్న తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చేవెళ్ల సభా వేదికపై నుంచి సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను చెప్పే ధైర్యం ఉన్నదా? అని అమిత్‌షాను నిలదీశారు. సీఎంపై, ఆయన కుటుంబంపై విమర్శలు చేయడం తప్ప రాష్ర్టానికి ఏదైనా చేశామని చెప్పగలుగుతారా ప్రశ్నించారు. రద్దుచేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును వెనక్కి ఇచ్చి వెళ్లాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అమిత్‌షాను డిమాండ్ చేశారు.
ఏం మంచి పనులు చేశారో చెప్పండి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ఏ ఒక్క వర్గానికి న్యాయం చేసిన దాఖాలాలు లేవని ఎమ్మెల్యే కాలె యాదయ్య విమర్శించారు. దళితులకు, మహిళలకు ఏమైనా కొత్త పథకాలు తీసుకువచ్చారా? రైతులకు, కార్మికులకు ఎమైనా మేలు చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంపై విషం కక్కటం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు ఏమిచ్చారో చెప్పండి
చేవెళ్ల గడ్డ మీదికి వచ్చి ఒక్క పల్లెకు వెళ్లి చూసినా ప్రగతి ఎలా ఉంటుందో అమిత్‌షాకు తెలుస్తుందని సబితాఇంద్రారెడ్డి అన్నారు. తొమ్మిదేండ్లలో దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని చెప్పడానికి చేవెళ్ల గడ్డపై బహిరంగ సభ పెడుతున్నారని అమిత్‌షాను, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘రాష్ర్టానికి నిధులు, ప్రాజెక్టులు ఇవ్వాలని ఎన్నోసార్లు అడిగాం. మేము అడిగిన వాటిలో ఒక్కటంటే ఒక్కటన్నా ఇచ్చామని చెప్పగలరా? చట్టబద్ధంగా రావాల్సినవాటికి మించి ఏమైనా ఇచ్చామని చెప్పగలరా? కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా అడిగాం. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పడానికి వస్తున్నారా? పాలమూరు-రంగారెడ్డికి మోకాలడ్డామని చెప్పడానికి వస్తున్నారా? ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి నిరుద్యోగుల ఆశలను గల్లంతు చేశామని చెప్పడానికి వస్తున్నారా? ఫార్మా సిటీకి సహకరించలేమని చెప్పడానికి వస్తున్నారా?’ అని ప్రశ్నించారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అడిగితే కేంద్రం మొండిచెయ్యి చూపినా సీఎం కేసీఆర్ చేవెళ్ల గడ్డమీద శంకర్పల్లి మండలం కొండకల్లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని తెలిపారు.