Himanshu | శేరిలింగంపల్లి, జూలై 12: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 22,000 స్కూళ్లలో 22 లక్షల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వారానికి మూడు రోజులు రాగి జావ అందిస్తున్నామని చెప్పారు. కుటుంబంలో పెద్దలు నేర్పిన సంస్కారం.. పిల్లలు చేసే మంచి పనుల ద్వారా సమాజంలో బహిర్గతమవుతుందని అన్నారు. సమాజానికి మంచి చేయాలనే సీఎం కేసీఆర్ ఆరాటానికి అద్దంగా ఆయన తనయుడు కేటీఆర్ నిలిస్తే… మంత్రి కేటీఆర్ సామాజిక స్పృహకు నిదర్శనంగా ఆయన కుమారుడు హిమాన్షు నిలిచారని ప్రశంసించారు. హిమాన్షు తన సహచర విద్యార్థులతో కలిసి పునరుద్ధరించిన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కేశవనగర్ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వ విప్ అరెకపూడిగాంధీతో కలిసి మంత్రి సబిత బుధవారం ప్రారంభించారు. మంచి మనసుతో గొప్ప ఆలోచన చేసి 10 మందికి స్ఫూర్తిగా నిలిచేలా హిమాన్షు చిన్న వయసులోనే పాఠశాలను దత్తత తీసుకొని ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే గాంధీ అభినందించారు. హిమాన్షు స్ఫూర్తితో కేశవనగర్ కాలనీని మంత్రి సబితారెడ్డితో కలిసి తాను దత్తత తీసుకొంటున్నట్టు ప్రకటించారు.
తాతయ్య మాటలే స్ఫూర్తి
సవాళ్లు ఎదుర్కొనే ఆలోచనలు చేయడం చదువుకున్న సమాజంతోనే సాధ్యమవుతుందని చెప్పిన సీఎం, తన తాత కేసీఆర్ స్ఫూర్తితోనే సామాజిక సేవ చేయాలన్న తపన తనలో మొదలైందని హిమాన్షు తెలిపారు. ఏదో ఒక మంచి చేయాలని తలచి విద్యార్థులమంతా ఓ బృందంగా ఏర్పడి 90 లక్షలు సేకరించి కేశవనగర్ పాఠశాలను అభివృద్ధి చేశామని చెప్పారు. ‘నేను 2022లో ఓక్రిడ్జ్‌లో కామన్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సీఏఎస్ ద్వారా వచ్చే నిధులను ఎప్పటిలాగే ఏదో ఒక ఆర్గనైజేషన్‌కు ఇవ్వడం కాకుండా ఏదైనా పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిద్దామని అనుకున్నాం. అందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కేశవనగర్ పాఠశాలను ఎంచుకున్నాం. అందుకోసం సీఏఎస్ ద్వారా వచ్చిన నిధులు సరిపోవని గుర్తించి స్కూళ్లో రెండు పెద్ద ఈవెంట్లను నిర్వహించి 40 లక్షలు సమకూర్చాం.
మిగతావి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా సేకరించాం. చదువుకున్న సమాజమే త్వరగా సమస్యలను అర్థం చేసుకోగలదని, పేదరికాన్ని నిర్మూలించేందుకు వారు అవసరమైన ఆలోచనలు చేస్తారని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారు. ఆయనిచ్చిన స్ఫూర్తితో మంచి చేయాలనే తప్పన పెరిగింది. అయితే ఈ పని చేసేటప్పుడు చదువుపై శ్రద్ధ తగ్గి గ్రేడ్ తగ్గొచ్చని నాన్న కేటీఆర్‌కు చెప్పాను. ఇంత మంచి పని చేయడంవల్ల నీ గ్రేడ్ తగ్గొచ్చు. కానీ నువ్వు చేసే ఆ పని ద్వారా మరో వందమందికి చదువుల్లో గ్రేడ్ పెరుగుతుంది. తప్పకుండా చెయ్యి.. నీకు గ్రేడ్ తగ్గినా ఫర్వాలేదు అని ప్రోత్సహించారు’ అని హిమాన్షు చెప్పారు. ఓక్రిడ్జ్ పాఠశాల ప్రిన్సిపాల్ దీపికారావు, సీఏఎస్ కో-ఆర్డినేటర్ శాలిని సహకారంతోనే పాఠశాల పునరుద్ధరణ సాధ్యమైందని తెలిపారు. బుధవారం తన పుట్టిన రోజు కూడా కావడంతో హిమాన్షు పాఠశాల విద్యార్థుల మధ్య కేక్ కట్‌చేసి జన్మదినాన్ని జరుపుకొన్నారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు అందజేసి..కొత్తగా నిర్మించిన డైనింగ్హాల్లో వారితో కలిసి భోజనాలు చేశారు.