ఖమ్మం: రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలుచేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. యాసంగి వడ్లను కొనుగులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం కొనడానికి ముందుకొచ్చిందని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని మంచుకొండలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్లో వరి పండించారని, 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశామన్నారు.
జిల్లా వ్యాప్తంగా 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేశామని, అవసరమైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో పండిన యాసంగి పంటను కొనుగోలు చేయాలని గల్లి నుంచి ఢిల్లీ దాకా ఆందోళనలు చేసినప్పటికీ కేంద్రప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు.
గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఏకగ్రీవ తీర్మానాలు పంపినా స్పందించలేదన్నారు. సాక్షాత్తు సీఎం కేసీఆరే ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ చలనం రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రైతులను రెచ్చగొట్టి వరి వేసేలా చేసిన బీజేపీ నాయకులు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.