Minister Puvvada Ajay | ఖమ్మం : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) పేదలకు చేసిందేమీ లేదని, ప్రభుత్వాన్ని గద్దె దింపాలని రంకెలేస్తే నీకు భయపడి ప్రభుత్వం దిగిపొద్దా అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy )ని ఉద్దేశించి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Minister Puvvada Ajay ) సూటిగా ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem Dist ) అశ్వారావుపేట( Ashwaraopeta ) నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా( Khammam Dist ) సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Govt ) నిబద్దతతో, పటిష్ట ప్రణాళికతో పని చేస్తుందని, అభివృధ్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం క్షేత్ర స్థాయిలో అమలవుతుంటే మీకు కనిపించకపోవడం విచారకరమని, పైగా వాటిపై స్పష్టమైన అవగాహన లేకుండా అవాకులు చవాకులు పేలడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణ ను నాశనం చేయలని కొందరు బయలుదేరారని, మీరు కంటున్న కలలు ఎప్పటికీ పగటి కలలుగానే మిగిలిపోతాయని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్( CM KCR ) శ్రీరామరక్ష అని అజయ్ కుమార్ స్పష్టం చేశారు. రైతుల కోసమే సీతారామ సాగర్ ప్రాజెక్ట్( Seetarama Sagar Project ) ను కడుతున్నారని, ఆయా పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తగిన సమయంలో ప్రాజెక్ట్ పూర్తి చేసి గోదావరి( Godavari River ) జలాలను రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్ట్ కోసం రందిపడాల్సిన అవసరం లేదన్నారు.
ప్రజల కష్టాలు పడుతున్నారు అని మాట్లాడుతున్న నీవు మొన్నటి వరకు ఇదే ప్రభుత్వంలో బాధ్యత గల పదవిలో ఉన్నపుడు ఎందుకు మాట్లాడలేదని పువ్వాడ అజయ్ ప్రశ్నించారు. ప్రజలు కష్టాలు పడుతున్నారని నేడు కొత్త పలుకులు పలకడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నువ్వు పదవిలో ఉన్న సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమీ లేదని, తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. పార్టీ నీకు కల్పించిన అన్ని అవకాశాలను దుర్వినియోగం చేసి స్వలాభం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నావని ధ్వజమెత్తారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి చేసిన ప్రజాప్రతినిధుల జాబితాలో నీ పేరు లేదని, జిల్లాను నువ్వేదో తీర్చిదిద్దినట్లు ఉపన్యాసాలు దంచితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఇక నైనా మీ పరిధిలో మీరు ఉండటం మంచిదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అశ్వరావుపేట ముఖ ద్వారంగా ఉన్నందున దీనికి సముచిత స్థానం కల్పిస్తామని, రానున్న 4 నెలల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టి వెలుగు జిలుగులతో సుందరీకరిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు.