హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు ఉత్సాహాంతో స్టాక్ పెట్టుకోవడం వల్లే యూరియా కొరత ఏర్పడిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న మాట నిజమేనని అంగీకరించారు. ఈ సమస్యను కేంద్రప్రభుత్వమే పరిష్కరించాల్సి ఉంటుందని చెప్పారు. యూరియా విషయంలో కేంద్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపిస్తున్నదని ఆరోపించారు. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్యను పరిష్కరించకపోతే.. రైతుల సహకారంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులతో చర్చిస్తామని తెలిపారు.
ఎరువుల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే
ఎరువులు, రసాయనిక పరిశ్రమలశాఖ కేంద్రప్రభుత్వం దగ్గరే ఉంటుందని, రాష్ట్రప్రభుత్వంలో ఉండదని మంత్రి పొన్నం ప్రభాక ర్ చెప్పుకొచ్చారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులకు కూడా ఈ విషయం తెలుసని చెప్పారు. అయినా తెలంగాణ రైతుల యూరియా కొరత సమస్యను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయకక్షతో ఉద్దేశపూర్వకంగానే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఓపెన్ చేయట్లేదని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వంపై కక్ష ఉంటే మరో రకంగా తీర్చుకోవాలని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులపై కక్ష తీర్చుకోవాలని వ్యాఖ్యానించారు. కానీ రైతులపై ప్రభావం చూపేలా, రైతులు రోడ్ల వెంట తిరిగేలా వ్యవహరించవద్దని కోరారు.
కేంద్రమంత్రులకు చేతనైతే కేంద్రం నుంచి ఎరువులు తీసుకురావాలని, వాళ్లకు చేతకాకపోతే.. వారితో కలిసి కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లేందుకు రాష్ట్ర మంత్రులందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమించేలా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే నిర్లక్ష్యం చేస్తున్నదనే అనుమానం కలుగుతున్నదని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు వ్యవసాయం, రైతులు, ఎరువుల గురించి కనీస అవగాహన లేదని మండిపడ్డారు. తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు లేదా?అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతుల యూరియా అవసరాల కోసం ఏనాడైనా కేంద్రానికి రాంచందర్‌రావు లేఖ రాశారా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీ.. దొందూదొందే!
పొన్నం వ్యాఖ్యలపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు పూటకో మాట మాట్లాడుతూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ రైతులను నట్టేట ముం చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల సరఫరా బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో యూరియా కొరత లేనేలేదని, బీఆర్ఎస్ నేతలు, కొన్ని పత్రికలు, టీవీలు సృష్టించిన కృత్రిమ కొరతనే అంటూ బుకాయించిన పొన్నం ప్రభాకర్‌కు… కొరత ఉందనే విషయం ఎప్పుడు జ్ఞానోదయమైందని ప్రశ్నిస్తున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో వివిధ గ్రామాల రైతులు రక్తాలు వచ్చేలా దాడులు చేసుకుంటే గానీ.. కొరత గురించి తెలియలేదా అని నిలదీస్తున్నారు. ఇప్పుడు కూడా కొరత ఉందని చెప్తున్న మంత్రి.. అందుకు ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకోకపోవడం ముమ్మాటికీ ఆత్మవంచనే అని మండిపడుతున్నారు.