వేములవాడ: మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి రాజన్నను దర్శింకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధ్యతతో సర్వే చేస్తున్నామని తెలిపారు. జీవో 18 ప్రకారంగానే సర్వే జరుగుతున్నదని చెప్పారు. రాజకీయ ప్రయోజనం కోసం సర్వేలు చేసి లబ్ధి పొందే ఆలోచన లేదన్నారు.
ప్రభుత్వం బలవంతంగా ఆధార్, పాన్ వివరాలు సేకరించడం లేదని వెల్లడించారు. ఇష్టముంటేనే కులం, ఆధార్, పాన్ వివరాలు చెప్పొచ్చన్నారు. వివరాలు చెప్పడం ఇష్టం లేకుంటే 999 ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ఎన్యుమరేటర్ల విధులకు ఆటకం కలిగిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో చేసిన సర్వేను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని చెప్పారు.
సంక్షేమ పథకాల్లో కోతలు తప్పవా? ఏమైనా వచ్చే అవకాశాలూ చేజారుతాయా? అసలు ఆస్తులు, ఆదాయం, అప్పుల వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు? మునుపు చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులేమయ్యాయి? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకంలో అలజడి సృష్టిస్తున్న ప్రశ్నలు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. వీటన్నింటికీ ప్రజలకు సరైన సమాధానం దొరకకుండానే సర్వే మాత్రం యథాతథంగా కొనసాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాల్లో ఇప్పటికే కోత విధించడం కూడా ప్రజల భయాందోళనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది.
అదీగాక సర్వే ఎందుకనే అంశంపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడం కారణంగా నిలుస్తున్నది. రిజర్వేషన్ల పెంపు కోసం అనుకున్నా, అలాంటప్పుడు ఆదాయ వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు? అన్నది ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. మరోవైపు గతంలో ప్రజాపాలన దరఖాస్తులే రోడ్లపై దర్శనమివ్వడంతో ప్రస్తుతం అందిస్తున్న సమాచారం సైతం అదే తరహాలో ఏ రోడ్లపాలు అవుతాయనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వెరసి సర్వేలో ప్రధానంగా అనేక ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి సైతం ప్రజలు విముఖత చూపుతున్నారు.
ఆదాయ వివరాలు ఎందుకు?
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఇంటింటి సర్వే నిర్వహణను ప్రకటించింది. మొత్తంగా 75 ప్రశ్నలతో ప్రశ్నావళిని రూపొందించింది. సర్వేలో మహిళనే గృహ యజమానిగా గౌరవిస్తూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల, రాజకీయాలకు సంబంధించిన వివిధ అంశాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే పార్టు-1కు సంబంధించిన కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు, విద్య, ఉపాధి, భూముల వివరాలు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసల సమాచారం, రాజకీయ అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. వాటిపై ప్రజలు పెద్దగా అభ్యంతరాలను వ్యక్తం చేయడంలేదు. కానీ పార్టు-2లోని ప్రశ్నలపై మాత్రం క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకతతోపాటు, ప్రజానీకంలో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీనిలో మొత్తం 17 కుటుంబస్థాయి ప్రశ్నలు ఉండగా, వాటిలో 7 ప్రధాన, మిగతావి అనుబంధ ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో వ్యవసాయ భూముల సమగ్ర సమాచారంతోపాటు విద్యా, ఉద్యోగం కోసం రిజర్వేషన్ల లబ్ధి పొందినా, గత ఐదేండ్లలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన పథకాల వివరాలను, ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వలస వెళ్లిన కుటుంబీకుల వివరాలు, ఉపాధి, వార్షిక ఆదాయం, వ్యాపారులైతే వార్షిక టర్నోవర్ వివరాలను, బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు, అప్పు లు, ఇతర ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజానీకంలో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి, ఆదాయ వ్యయాలకు సంబంధించిన పత్రాలను కూడా చూపాలని ఎన్యూమరేటర్లు కోరుతుండటంతో ప్రజలు ఒకింత భయాందోళనకు సైతం గురవుతున్నారు. రిజర్వేషన్ల పెంపు కోసమైతే ఆదాయ వివరాలు, ఆధార్ లెక్కలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల్లో కత్తిరింపుల కోసమే సమస్త వివరాలను సేకరిస్తున్నదని ప్రజానీకం బలంగా విశ్వసిస్తున్నది.
గ్యారెంటీల అమలు కోసమా?
ఇంటింటి సర్వేలో సేకరించే వివరాల ఆధారంగానే రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల అర్హతను నిర్ధారించడానికి కూడా ప్రభు త్వం వినియోగించుకునే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.