హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగలందరూ రాయితీపై ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు మహీంద్ర ఎలక్ట్రిక్స్, ఏథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటర్స్, ఓలాతోపాటు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ గుర్తింపును చూపించి.. 10 నుంచి 20శాతం వరకూ రాయితీతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. మంగళవారం సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, రవాణాశాఖ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ర్టాన్ని కాలుష్య రహితనగరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీలు కొనుగోలులో రాయితీలు ఇప్పిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఓఆర్ఆర్ లోప ల అన్నీ ఎలక్ట్రిక్ బస్‌లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్‌ల రాకతో ఆర్టీసీ కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతుందనే ప్రశ్నకు.. ఆర్టీసీ కార్మికులెవ్వరికీ అన్యాయం జరుగదని, వారిని సర్దుబాటు చేస్తామని పొన్నం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రవా ణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ ప్రియాంక, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.