ఎల్లారెడ్డిపేట, జనవరి 30: బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై మాట్లాడితే చాలు.. అధికార కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం చెప్తున్నారు. పొన్నం ప్రభాకర్ మంత్రి అయ్యాక మంగళవారం తొలిసారి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దుమాలలో ఏర్పాటు చేసిన సభలో జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రగతి ప్రాంగణాన్ని గొప్పగా నిర్మించారని బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధిని చెప్తుండగా.. ఓ కాంగ్రెస్ కార్యకర్త ‘జడ్పీటీసీ నువ్ మాట్లాడొద్దు’ అంటూ అభ్యంతరం తెలిపారు. గత పదేండ్లలో బాగా అభివృద్ధి జరిగిందని, అదే అభివృద్ధిని కొనసాగించాలని తాను కోరినట్టు జడ్పీటీసీ తెలిపారు.
ఇదే క్రమంలో ఎంపీపీ పిల్లి రేణుకకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, ఆడిబిడ్డను నారాజ్ చేయొద్దని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కలుగజేసుకుని కలెక్టరేట్లో సమావేశం ఉన్నందున ఎంపీపీకి మైక్ ఇవ్వలేదని తెలిపారు. ఎంపీపీ పిల్లి రేణుక మాట్లాడుతూ.. తనకు అందరూ చిరకాల మిత్రులేనని, అందరినీ కలుపుకుపోయి అభివృద్ధి పనులు కొనసాగిస్తానని పేర్కొన్నారు.
కాగా, అధికారిక కార్యక్రమానికి సంబంధించి వేదికపైకి మంత్రితోపాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య ఆహ్వానించడం గమనార్హం. ఇక్కడ ఎంపీపీని వేదికపైకి ఆహ్వానించకపోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.