కరీంనగర్: పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. ప్రధాని మోదీ పదేండ్ల పాలనలో దేశంలో శాంతి లేదని విమర్శించారు. దేశ సంపదను కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఎందుకు పంపిణీ చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని మతాలు, వర్గాలకు స్వేచ్ఛ ఉంటుందన్నారు. పార్టీ నాయకులతో కలిసి కరీంనగర్లో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. అందుకే ఆయన మొహంలో భయం కనిపిస్తున్నదని విమర్శించారు.
అద్వానీ కట్టిన మెట్లపై వచ్చి పీఠం ఎక్కారని చెప్పారు. పీవీ గురించి మాట్లాడే అర్హత మోదీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని పనులు జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నాయకులు ఏదైనా చేస్తారని విమర్శించారు. ఎన్నికల కోడ్ ముగియగానే హామీలు అమలు చేస్తామన్నారు. రుణమాఫీ, పెన్షన్ల పెంపు, రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు.