హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏనాడూ పట్టించుకోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సర్కార్ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను నివారించలేని మంత్రి సమ్మె తొలిరోజే ఆగమాగం అయ్యారు. బుధవారం వరుసగా ప్రెస్‌మీట్ పెట్టి, ప్రెస్‌నోట్ విడుదల చేసి హడావుడి చేశారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు మోపే కుయుక్తులకు దిగారు. ఎన్నికలకు రెండ్రోజుల ముందే విలీన ప్రక్రియ చేపట్టారని నోరుపారేసుకున్నారు. 2023 మేలోనే నిపుణులతో సంప్రదించి, ఆర్టీసీ విలీన ప్రక్రియ మొదలు పెట్టి, అసెంబ్లీలో ఆమోదింపజేసి ఆఖరికి గెజిట్ కూడా నాటి సీఎం కేసీఆర్ విడుదల చేశారు.
కాగా, బీఆర్ఎస్ ఇచ్చిన అపాయింటెడ్ డేకు కాలం చెల్లిందని, తాము అధికారంలోకొస్తే ఆర్టీసీ కార్మికులను వందరోజుల్లోనే ప్రభుత్వంలో విలీనం చేస్తామని, యూనియన్లను పునరుద్ధరిస్తామని హామీలిచ్చి, మ్యానిఫెస్టోలో చేర్చి మరీ కాంగ్రెస్ నేతలు ఇప్పడు దగా చేశారు. అవి అమలు చేయకపోగా ఉల్టా బీఆర్ఎస్పైనే నిందలు వేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ప్రతిపక్షం అడిగినా, బయట కార్మికులు కోరినా.. కమిటీ వేశామని చెప్పి తప్పించుకుంటూ వచ్చిన మంత్రి పొన్నం.. మొన్నటివరకూ కమిటీనే వేయలేదు. కార్మికులు సమ్మెకు వెళ్తున్నారని తెలిసిన వెంటనే ఆగమేఘాలపై ఉన్నతాధికారులతో ఓ కమిటీని వేశారు. గతంలో కేసీఆర్ ప్రతిపాదించిన ఉన్నత విభాగాల అధిపతులతోనే కాంగ్రెస్ సర్కార్ కమిటీ వేయడం గమనార్హం.
మాటలు తప్ప.. చేతలు శూన్యం!
రెండున్నరేండ్లుగా తమ సమస్యల పరిష్కారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు చెప్తూ వచ్చారే తప్ప.. చేతల్లో చూపలేదని కార్మికులే మండిపడుతున్నారు. విలీన అంశం తెచ్చిన ప్రతిసారీ బుజ్జగింపులతోనే సరిపెడుతూ వచ్చారని చెప్తున్నారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, కేవలం కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలనే కోరుతున్నామని చెప్తున్నారు. వారు హామీ ఇచ్చిన ఉద్యోగుల విలీనం, సంఘాల ఏర్పాటు, పీఆర్సీ అంశాలను వదిలి మిగతావి నెరవేరుస్తామని చెప్పడం హాస్యాస్పదమని అంటున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న కార్మికులపై పోలీసులను ఉసిగొల్పుతూనే.. ‘అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు’ అనే విధానంలో మంత్రి వ్యవహరిస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులను మాటలతో వంచించడం అలవాటు చేసుకున్న మంత్రి పొన్నం పప్పులేవీ ఇప్పుడు ఉడకవని, తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం తుదికంటూ పోరాడుతామని కార్మికులు ప్రతినబూనుతున్నారు.
ఆర్టీసీ సమ్మెకు కేసీఆర్ సభతో లింకు
అసంబద్ధంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ప్రజలు, మహిళలు, ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని జగిత్యాల సభలో కేసీఆర్ సానుకూల దృక్పథంతో వ్యాఖ్యానించారు. ఆ మాటలతోనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారని అసంబద్ధమైన అబద్ధాలను మంత్రి పొన్నం బుధవారం నాటి ప్రెస్మీట్లో వల్లెవేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే కచ్చితంగా సమ్మెకు వెళ్తామని 2025 మేలోనే కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చారు. మళ్లీ ఈ ఏడాది మార్చి 13న రెండోసారి నోటీసులు ఇచ్చారు. మార్చి నుంచి కాలయాపన చేస్తుండటం, మంత్రి హోదాలో ఉండి కార్మికులకు కేవలం కబుర్లు మాత్రమే చెప్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే వారు సమ్మెకు వెళ్లారు. దీనిని కూడా రాజకీయం చేయాలని మంత్రి ప్రయత్నిస్తుండటంతో కార్మికులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.