Caste Survey | హైదరాబాద్, అక్టోబర్27 (నమస్తే తెలంగాణ): ‘కులగణన సర్వేలో తప్పులున్నాయ్. బీసీ సంఘాల సలహాలను, సూచనలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం. సర్వేను పునఃసమీక్షిస్తాం. అవసరమైతే నిజనిర్ధారణ కమిటీని వేస్తాం’ అంటూ బీసీ సంఘాల నేతలు, మేధావులకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. కులగణన విషయంలో ప్రభుత్వానికి అన్నివిధాలుగా సహకరించాలని, రాజకీయం చేయవద్దంటూ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే కులగణనకు సంబంధించి కచ్చితమైన లెక్క తేలేంతవరకూ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించవద్దని బీసీ సంఘాల నేతలు సైతం అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది.
కులగణన సర్వే గణాంకాలపై సర్వత్రా వ్యతిరేకత, అభ్యంతరాలు, అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు సచివాలయంలో శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ కమిషన్ సభ్యుడు, ఎంపీ సురేశ్ షెటార్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్, దేవళ్ల సమ్మయ్యతోపాటు పలువురు బీసీ సంఘం నేతలు, ప్రొఫెసర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. బీసీ కులగణన అంశాలపై చర్చించారు.
తొలుత మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ సంఘాలు, మేధావులపై అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. సర్వేను ఎలా చేసింది? నిధుల కేటాయింపు, తదితర అంశాలపై అసెంబ్లీలో ఏకరువు పెట్టారని సమావేశంలో పాల్గొన్న నేతల ద్వారా తెలిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పెద్దలతో బీసీ సంఘాల నేతలు, మేధావుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు సమాచారం. సర్వే తీరుపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును మేధావులు తూర్పారబట్టినట్టు తెలుస్తున్నది.
‘సర్వే చేస్తున్నప్పుడు ఎవరూ స్పందించలేదు. ప్రజల్ని చైతన్యం చేయలేదు. ఇప్పుడేమో సర్వే తప్పులతడక అంటూ రాద్ధాంతం చేస్తున్నారు. సర్వే అప్పుడు ఎక్కడికి పోయారు’ అంటూ తొలుత బీసీ సంఘాల ప్రతినిధులతో మంత్రి పొన్నం అసహనం ప్రదర్శించారని సమాచారం. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై పలువురు బీసీ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. సర్వే చేపట్టే ముందు తమను ప్రభుత్వం పట్టించుకోనేలేదంటూ బీసీ ప్రతినిధులు నిలదీశారని తెలుస్తున్నది. అయినా ప్రభుత్వానికి అనేక విధాలుగా సర్వేపై సలహాలు, సూచనలు చేస్తూ వచ్చామని, వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. న్యాయసమీక్ష ఎదుట నిలవాలంటే పాటించాల్సిన విధానాలను, పద్ధతులతో కూడిన సమగ్రమైన నివేదికలను సీఎం రేవంత్‌రెడ్డికి వ్యక్తిగతంగా సమర్పించామని, అవన్నీ బుట్టదాఖలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. వాటిని పరిగణనలోకి తీసుకున్నా సర్వే గందరగోళంగా మారకపోయేదని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇప్పటికీ తప్పులను సరిదిద్దాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదని పలువురు మండిపడ్డారు. సర్వేపై సమావేశానికి పిలిచి సబ్‌ప్లాన్‌పై చర్చించాలని కోరడమేమిటని నిలదీసినట్టు తెలిసింది. అదే విధంగా సర్వే లెక్కలు వాస్తవమేనని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్తుండగా, బీసీ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రంలో 3.29 కోట్ల మంది ఉండగా, సివిల్ సప్లయ్ శాఖ గణాంకాల ప్రకారం 1.25 కోట్లు ఇండ్లు, ఇంకా 2022 ఆధార్ కార్డు లెక్కల ప్రకారం 3.89 కోట్ల మంది ఉన్నారని, మరి ప్రభుత్వం కేవలం 3.70 కోట్ల మందే ఉన్నారని 1.15 కోట్ల ఇండ్లే ఉన్నాయని లెక్కలు ఎలా తేల్చిందని బీసీ ప్రతినిధులు నిలదీసినట్టు సమాచారం. గణాంకాలను సేకరించిన ప్రణాళిక శాఖ అధికారులను, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, నోడల్ ఆఫీసర్, ఐఏఎస్ అనుదీప్ దురిశెట్టి, ఇతర అధికార యంత్రాంగాన్ని పిలవకుండా సమావేశం ఎందుకు పెట్టినట్టు అని ఓ బీసీ నేత నిప్పులు చెరిగినట్టు తెలిసింది. సర్వేపై, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్ అమలుపై బీసీ సంఘాల నేతలు, మేధావులు ఇచ్చిన సూచనలు, సలహాలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూస్తామని మంత్రి పొన్న హామీ ఇచ్చారు.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సమావేశం అనంతరం డిమాం డ్ చేశారు. సర్వే గణాంకాలపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ తెలిపారు.
ప్రభుత్వం ఇండ్ల లెక్కలే చెప్తున్నదని, ఇండ్లులేని వారిని ఎలా గణించారని, సంచార జాతుల వివరాలను ఏవిధంగా నమోదు చేశారని, ఏ డాటా ఆధారంగా లెక్కలను క్రోడీకరించి, బీసీ జనాభా లెక్కలను తగ్గించి తేల్చారని, దానివల్ల రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉన్నదనే విషయం కూడా తెలియదా? అం టూ ప్రభుత్వ పెద్దలను బీసీ ప్రతినిధులు తుర్పారపట్టినట్టు సమాచారం. బీసీసంఘాల నేతలు, మేధావులు వేసిన ప్రశ్నలతో ప్రభుత్వ పెద్దలు ఉక్కిరిబిక్కిరైనట్టు తెలిసింది. ఎట్టకేలకు సర్వేలో తప్పులు ఉన్నాయని అంగీకరించడంతోపాటు, అన్ని అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పునఃసమీక్షిస్తామని, అందుకు నిజనిర్ధారణ కమిటీ వేస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు తెలిసింది. కులగణన అంశం పై ప్రభుత్వానికి అన్నివిధాలుగా సహకరించాలని బుజ్జగించినట్టు తెలిసింది.