కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 12: సిరిసిల్లలో నేత కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన కరీంనగర్ కలెక్టరేట్లో మహిళాశక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కేటీఆర్ ఎమ్మెల్యేగా, తాను ఎంపీగా ఉన్నప్పుడు చేనేత కార్మికుల సమస్యల కోసం కలిసి పనిచేశామని గుర్తుచేసుకున్నారు. తనను రమ్మని కోరితే కేటీఆర్ వద్దకు వెళ్తానని చెప్పారు. నేత కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఎవరు సూచనలు, సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని తెలిపారు. ఇటీవల సిరిసిల్లలో జరిగిన కుటుంబం ఆత్మహత్యకు గతంలో చేసిన అప్పులే కారణమని నివేదికలందాయని పేర్కొన్నారు. రైస్ మిల్లర్ల నుంచి సీఎంఆర్‌కు సంబంధించి ఇంకా రూ.18 వేల కోట్ల విలువైన ధాన్యం రావాల్సి ఉన్నదని, అయినా ప్రభుత్వం తమను బద్నాం చేస్తున్నదంటూ మిల్లర్లు వ్యాఖ్యలు చేయడం సబబుకాదని చెప్పారు.
సమగ్ర ఇంటింటి సర్వేపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ యజమానికి నష్టం జరుగుతుందని భావిస్తే, సదరు సమాచారాన్ని ఇవ్వకపోయినా పరువాలేదని తెలిపారు. ఇది ప్రభుత్వ పరంగా జరుగుతున్న సర్వే అని, ప్రతి విషయం గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లను, సర్వేను పరిశీలిస్తున్న అధికారులను బెదిరింపులకు గురిచేసినా, వారిపై దాడులకు పాల్పడినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మండల సమాఖ్యల ఆధ్వర్యంలో రోడ్డు రవాణా సంస్థలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మొదటి విడతగా 600 బస్సులు ఐకేపీ ద్వారా కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడి అత్యంత హేయనీయమని, విచారణకు రమ్మని నమ్మపలికి గ్రామస్థులతో కలిసి దాడి చేయడం న్యాయమేనా? దాడులతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందా? అని ప్రశ్నించారు.