హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం నుంచి పైసా తీసుకురాలేని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉన్నదని బీజేపీ మంత్రులు, ఎంపీలు, నాయకులపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు.
విద్వేష ప్రచారం, విధ్వంస చర్యలు, రాజకీయ నియంతృత్వం, కార్పొరేట్లకు పెత్తనం, మత ఆధిపత్యం, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా మోసం చేశారని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా నాన్చుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలను వంచించి లేఖలు రాస్తే ప్రయోజనం లేదని, చేతనైతే ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.