హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ విడుదల చేసింది చార్జిషీట్ కాదని, రిప్రజెంటేషన్‌గా భావిస్తున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సంవత్సరం పాలన తర్వాత మమ్మల్ని విమర్శించినట్టుగా చార్జిషీట్ చేసినా బాగుండేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. చార్జిషీట్ విడుదల చేయటం భావ్యంకాదని తెలిపారు. ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్కు డిస్చార్జిషీట్ ఇచ్చారు:మంత్రి పొంగులేటి
బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై ఏడాది క్రితమే తెలంగాణ ప్రజలు డిస్చార్జిషీట్ ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావుకి ఇంకా జ్ఞానోదయం కాకపోవడం విచారకరమని, వారి వాలకం దొంగే దొంగా అన్నట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. పదేండ్ల పాలనలో వందేండ్లకు సరిపడా దోపిడీ చేసిన వారే ఇవాళ చార్జిషీట్ అంటున్నారని తెలిపారు.
చార్జిషీట్ల పేరుతో మరో డ్రామా: మంత్రి సీతక్క
అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంటే, దాన్ని పకదారి పట్టించేందుకు బీఆర్ఎస్, బీజేపీలు చార్జిషీట్ల పేరుతో డ్రామలాడుతున్నాయని పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. సలహాలు, సూచనలు ఇవ్వకుండా ప్ర భుత్వాన్ని పడగొట్టాలన్న పన్నాగాలతో బీఆర్ఎస్, బీజేపీలు పనిచేస్తున్నాయని తెలిపారు. 54 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రూ.21 వే ల కోట్ల రైతుల రుణమాఫీ వంటి ఎన్నో హామీలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు.