సిద్దిపేట: సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణలో ఇది చారిత్రక ఘట్టమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతుందని చెప్పారు. సర్వే వల్ల సంక్షేమ పథకాల కోత ఉండదని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కుల గణన, సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్వే సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుందన్నారు. అన్ని రకాల అసమానతలు తొలగించేందుకే సర్వే చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో పలుచోట్ల కొందరు ఇబ్బందులు కలిగించారు, అది సరైనది కాదని చెప్పారు. కేవలం కులాల జనాభా తెలుసుకునేందుకే ఈ సర్వే చేస్తున్నామని వెల్లడించారు.
కాగా, సమగ్ర సర్వేలో కుటుంబ వివరాలు చెప్పేందుకు ప్రజలు నిరాకరిస్తున్నారు. సర్వే వివరాల సేకరణకు వెళ్లిన ఎన్యుమరేటర్లకే ప్రభుత్వ పాలనపై ప్రజలు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ‘ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడ? ఆరు గ్యారెంటీలు ఏమాయె? 420 హామీలు ఎటుపాయె? మళ్లీ కొత్తగా సర్వే ఎందుకు? వివరాలు చెప్పుడెందుకు?’ అంటూ అధికారులను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. ‘సర్వే లేదు.. ఏదీ లేదు.. మాకు ఈ ప్రభుత్వమే వద్దు” అంటూ తిప్పి పంపుతున్నారు. దీంతో చేసేదేమీలేక అరకొర సమాచారంతో, అందించిన వివరాలతోనే ఎన్యుమరేటర్లు తొలిరోజైన శనివారం తిరుగుముఖం పట్టారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని పలువురు ఎన్యుమరేటర్లే బాహాటంగా వాపోతున్నారు.
సర్వే చేయలేమంటూ కొందరు చేతులెత్తేస్తున్న పరిస్థితి నెలకొన్నది అంటే ప్రభుత్వంపై ఎంతగా వ్యతిరేకత ఉన్నదో దీన్నిబట్టే తెలుసుకోవచ్చు. సర్వే సందర్భంగా ఎన్యూమరేటర్లను ప్రజలు ఇంటింటా నిలదీస్తున్నారు. ఎన్యూమరేటర్లు సమాచార సేకరణకు ప్రశ్నలేయడం అటుంచితే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎక్కడికక్కడ ఎదురుప్రశ్నలు ఎదురై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎక్కడికి వెళ్లినా? ఎవరిని పలకరించినా? సర్వే ఎందుకు? కొత్తగా ఏమోస్తది? ఏం చేశారు? ఏం చేస్తరు?’ అంటూ అడుగడుగునా ప్రశ్నిస్తున్నారని స్వయంగా ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. రేవంత్రెడ్డి సర్కారు కొలువుదీరి ఏడాది కావస్తున్నా ఏ ఒక్క పథకం, హామీని అమలు చేయలేదని, మాటలు చెప్పి మోసం చేశాడని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని క్షేత్రస్థాయి అధికారులు తెలుపుతున్నారు.